India At 2047: కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే 5జీ స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించింది. 2017లో తొలిసారి ఐదవ తరం (5G) వాయు తరంగాలను వేలం వేయాలని ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. ధరలు ఎక్కువగా ఉన్నాయని భావించిన టెలికాం కంపెనీలు ఇందుకు దూరంగా ఉన్నాయి. ఈసారి రూ.4.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినా చివరికు  రూ. 1.5 లక్షల కోట్లకు వాయు తరంగాలను విక్రయించింది.


ఇటీవలి స్పెక్ట్రమ్ బిడ్‌లు అనేక విధాలుగా విజయవంతం అయ్యాయి. ఎందుకంటే 2017లో 3000 MHz బ్యాండ్‌లలో 5G ఎయిర్‌వేవ్‌ ప్రతిపాదిత విక్రయం పూర్తవ్వలేదు.  800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 మెగాహెర్జ్ బ్యాండ్ (megaherzt) స్పెక్ట్రమ్ అమ్ముడవ్వలేదు.  దాంతో వేలాన్ని వాయిదా వేయాలని టెలికాం కంపెనీలు పోరాడగా TRAI సంప్రదింపులు జరిపి విజయవంతం చేసింది.


2018లో 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 3300-3600 MHz బ్యాండ్‌లను 5G బ్యాండ్‌లుగా వేలం వేయాలని ట్రాయ్‌ సిఫార్సు చేసింది. వీటి ధర మరీ ఎక్కువగా ఉందని టెలికాం కంపెనీలు భావించాయి.  700 MHz ధరైతే అతిగా ఉందని పేర్కొన్నాయి. అయితే ఏజీఆర్‌ విషయంలో టెలికాం కంపెనీలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా 2020లో 8,300 MHz స్పెక్ట్రమ్ వేలం రిజర్వ్ ధరలను రూ. 5.2 లక్షల కోట్లుగానే ఉంచాలని డిజిటల్‌ కమ్యూనికేషన్ కమిషన్‌ (DCC) నిర్ణయం తీసుకుంది.


టెల్కోలకు ఉపశమనం


ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో ఇబ్బంది పడ్డ టెలికాం కంపెనీలకు ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్ ఐడియా మూతపడితే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రతికూల సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని కేంద్రం భావించింది. అప్పుల పాలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 5G స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనవని ఆందోళన చెందింది. అందుకే వాయిదాల పద్ధతిలో డబ్బులు కట్టేందుకు అనుమతి ఇచ్చింది.


విస్తరణ బాటలో టెలికాం ఇండస్ట్రీ


ప్రభుత్వం గతేడాది మార్చిలో 5G స్పెక్ట్రమ్ బిడ్‌లను ప్రారంభించినా మొత్తం స్పెక్ట్రమ్‌లో కేవలం 37 శాతాన్ని మాత్రమే విక్రయించగలిగింది. కేవలం రూ.77,815 కోట్లను మాత్రమే ఆర్జించింది. 700 MHz, 2500 MHz బ్యాండ్‌ల ధర అతిగా ఉందని భావించడంతో లాభాల్లో ఉన్న రిలయన్స్ జియో సైతం కొనుగోలు చేయలేదు.  రెండు వారాల క్రితం నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం మాత్రం విజయవంతమైంది. తొలిసారి 700 MHz స్పెక్ట్రమ్‌ను సైతం విక్రయించగలిగింది. దాంతో గతేడాదితో కన్నా రెట్టింపు, రూ. 1.5 లక్షల కోట్లను ఆర్జించింది. 


51 GHz స్పెక్ట్రమ్‌తో పాటు మొత్తం 72 GHz ఎయిర్‌వేవ్‌లలో 71 శాతాన్ని 22 టెలికాం సర్కిళ్లలో  రూ.1.5 లక్షల కోట్లకు ($19 బిలియన్) విక్రయించడం దూకుడైన చర్యేనని యూబీఎస్‌ అంచనా వేసింది.


'2-3 ఏళ్లుగా దశల వారీగా కాకుండా ఒకేసారి దేశవ్యాప్తంగా 3300MHz కొనుగోలు చేసిన టెలికాం ఆపరేటర్ల వ్యూహాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఖరీదైన 700MHz బ్యాండ్‌లో 10MHz స్పెక్ట్రమ్‌ను జియో దేశవ్యాప్తంగా కొనుగోలు చేయడం ఆశ్యర్యం కలిగించింది' అని యూబీఎస్‌ తెలిపింది.


'5G స్పెక్ట్రమ్ వేలం విజయవంతం అవ్వడం టెలికాం రంగ వృద్ధికి సంకేతం. భారీ స్థాయిలో వేలం జరగడం ఈ పరిశ్రమ విస్తరణ దశలో ఉందనేందుకు, సరికొత్త క్షక్ష్యలోకి ప్రవేశిస్తుందని చెప్పేందుకు సంకేతం' అని PHD ఛాంబర్ అధ్యక్షుడు ప్రదీప్ ముల్తానీ ఏబీపీ లైవ్‌తో అన్నారు.