Kerala Govt: కేరళ సర్కార్, రాష్ట్ర గవర్నర్ మధ్య చెలరేగిన వివాదం ఇంకా చల్లారలేదు. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను.. యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి తొలగించాలని పినరయి విజయన్ సర్కార్ ప్రయత్నిస్తోంది.
కొత్త బిల్లు
ఇందుకోసం రాష్త్ర విశ్వవిద్యాలయాలకు ఆ రంగంలోని మేధావులను ఛాన్సలర్లుగా నియమించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి కేరళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ఆమోదమైతే గవర్నర్ ఛాన్సలర్ పదవి కోల్పోతారు. డిసెంబర్ 5నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
కేరళ హైకోర్టు
సిజా థామస్‌ను ఏపీజే అబ్దుల్ కలాం టెక్నోలాజికల్ యూనివర్సిటీ కి ఇంచార్జీ వైస్ ఛాన్సలర్‌గా కొనసాగేందుకు కేరళ హైకోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా వీలైనంత త్వరగా సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని రాష్త్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై స్టే ఇవ్వాలని కేరళ సర్కార్ చేసిన అభ్యర్థనను జస్టిస్ దేవన్ రామచంద్రన్ తోసిపుచ్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం వైస్ ఛాన్సలర్ పదవిని గవర్నర్ నియమిస్తారని ఆయన అన్నారు.
ఇదీ వివాదం
9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని ఇటీవల గవర్నర్ ఆదేశించారు. దీంతో గవర్నర్, కేరళ సర్కార్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్‌ను తొలగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయంలో ఇటీవల మంత్రి బాలగోపాల్ చేసిన వ్యాఖ్యలు విద్రోహపూరితంగా ఉన్నాయని గవర్నర్ ఆరోపించారు. దీంతో ఆర్థిక మంత్రి బాలగోపాల్‌ను కేబినెట్ నుంచి తొలగించాలంటూ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం పినరయి విజయన్.. గవర్నర్‌పై విమర్శలు చేశారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Also Read: Watch Video: వెంట పడిన జనం- వెనక్కి తరిమిన గజరాజు! వైరల్ వీడియో