Kerala Islamophobia:


ముస్లిం వేషంలో ఉగ్రవాది..


కేరళలో జనవరి 3 నుంచి మొదలైన స్కూల్ ఆర్ట్స్ ఫెస్టివల్ వివాదాస్పదమవుతోంది. ముస్లిం వేషధారణలో ఉన్న వ్యక్తిని ఉగ్రవాదిగా చూపిస్తూ నాటకం వేయడం సంచలనమైంది. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆ నాటకం వేసిన సొసైటీపై నిషేధం విధించింది. అయినా... రాజకీయాలు రాజుకున్నాయి. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ వివాదంపై కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి స్పందించారు. ముస్లింలను ఉగ్రవాదిగా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమ పార్టీ ఐడియాలజీ కాదని స్పష్టం చేశారు. "MATHA సొసైటీ ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించే క్రమంలో వేసిన నాటకాన్ని ఖండిస్తున్నాం. మరోసారి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించాం" అని శివన్‌కుట్టి వెల్లడించారు. కచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేరళలో ఏటా జనవరిలో ఈ కేరళ స్కూల్ ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. అయితే...కరోనా కారణంగా రెండేళ్ల పాటు వాయిదా పడింది. ఈ సారి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ప్రభుత్వం భావించినా...మొదట్లోనే ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఓ వర్గం వాళ్ల డామినేషన్ పెరుగుతోందని ఇప్పటికే 
వివాదం అవుతుండగా...ఇప్పుడు ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించడం మరింత వివాదాస్పదమైంది. ఓ ఇండియన్ జవాన్‌ టెర్రరిస్ట్‌ను పట్టుకునే సీన్‌లో ఉగ్రవాదికి అరబ్ స్టైల్‌ డ్రెస్‌ వేయడం వల్ల గొడవ మొదలైంది. కమ్యూనిస్ట్ సంఘాలూ దీనిపై తీవ్రంగా మండి పడుతు న్నాయి. "ఓ ముస్లింను ఉగ్రవాదిగా చూపించడం ఏంటి.  ఘటనపై కచ్చితంగా విచారణ జరిపించాల్సిందే" అని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఘటనను ఖండించినప్పటికీ..బీజేపీ మాత్రం విమర్శలు చేస్తూనే ఉంది. ప్రభుత్వ ఐడియాలజీకి ఇది ఉదాహరణ అని ఆరోపిస్తోంది.






రాజకీయ రగడ..


ఈ వివాదంపై మాతా ఆర్ట్స్ సొసైటీ డైరెక్టర్ స్పందించారు. ఇలా జరగటం దురదృష్టకరం అని అన్నారు. "దీనిపై రాజకీయాలు చేయొద్దు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం ఇది. మేం ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాల్లో నాటకాలు వేశాం. మేం స్కిట్ చేసినప్పుడు ఎవరూ ఏమీ అనలేదు. మెచ్చుకున్నారు కూడా. కానీ ఉన్నట్టుండి ఈ వివాదం రాజుకుంది" అని చెప్పారు. పెరంబర, కొజికోడ్‌లో దాదాపు 3 దశాబ్దాలుగా ఈ సొసైటీ ఈవెంట్స్ చేస్తోంది. 200 మంది పని చేస్తున్నారు. మధ్యప్రాచ్య దేశాల్లోనూ ఈవెంట్స్ చేసింది ఈ సంస్థ. ఈ కారణంగానే...ప్రభుత్వం వీరిని ఆహ్వానించింది. కానీ...అది అనుకోని విధంగా చిక్కుల్లో పడింది. ప్రతిపక్షాల దాడిని ప్రభుత్వం ఖండిస్తూనే ఉన్నా...రాజకీయ వేడి మాత్రం ఇప్పట్లో చల్లారేలా లేదు. 


Also Read: PM Modi On RRR Team: ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం, ‘RRR’ టీమ్ కు ప్రధాని మోడీ అభినందనలు