Makar Sankranti 2023: సంక్రాంతి అంటేనే రైతుల కళ్లలో ఆనందాన్ని నింపేపండుగ..ధాన్య లక్ష్మిని నట్టింట్లోకి తీసుకొచ్చే పండుగ. ఆ ఆనందానికి, సిరిసంపదలకు కారణమైన పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా పూజించే రోజే కనుమ. అందుకే కనుమను పశువుల పండుగ అంటారు. ఈ రోజున పాడి పంటలకు సహకరించే పశువులను అలంకరించి, మంచి ఆహారం అందించి పూజిస్తారు. పక్షుల కోసం కూడా వరికంకులు ఇంటి చూరు దగ్గర వేలాడిదీస్తారు. కనుమ రోజు పెద్దలను తలుచుకుంటూ మంసాహారం తింటారు. మాంసాహారం తనని వారికోసం అవే పోషకాలు అందించే మినుము తినాలని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు ఉపయోగపడతాయి.

Also Read:  సంక్రాంతికి ఇంటిముందు ముగ్గుల్లో 'కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!


కనుమ రోజు ప్రయాణం ఎందుకు చేయకూడదు!
అయితే కనుమ రోజు పెద్దలకోసం వింధుభోజనాలు తయారు చేయడమే కాదు..కుటుంబం మొత్తం కలసి భోజనం చేయాలని చెబుతారు. పొద్దున్నే పశువులను పూజించడం, మధ్యాహ్నం పితృదేవతలకు తర్పణాలు వదలడం చేస్తారు. కొన్ని ఊర్లలో కనుమ రోజు గ్రామదేవతల ఆలయాల వద్ద బలులు ఇవ్వడం, పొంగళ్లు వండడం కూడా చేస్తారు. మూడు రోజుల పండుగలో మూడో రోజు కూడా చాలా ముఖ్యమే. ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి కనుమ రోజు కాకి కూడా కదలదు అని అనేవారు పెద్దలు. కాదుకూడదని  ఆ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. ఏడాదిలో మూడు రోజుల పాటూ సంబరంగా జరుపుకునే ఈ పండుగ రోజు అంతా కలసి ఉండాలనే ఉద్దేశంతో అలా చెప్పారు కాన ప్రయాణం చేస్తే ఏదో జరిగిపోతుందనే భావన అవసరం లేదంటారు మరికొందరు...


Also Read: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!


ముక్కనుమ రోజు కూడా ప్రయాణం చేయకూడదా!
ఇంకొందరు ముక్కనుము రోజు కూడా ప్రయాణం చేయకూడదంటారు. వాస్తవానికి ముక్కనుమ అనేది ఈ మధ్యే మొదలైన సంప్రదాయం. సంక్రాంతి ముందు రోజు భోగిని కీడుపండుగగా భావిస్తారు. ఈరోజు భోగిమంటలు వేయడం, భోగిపళ్లు పోయడం, బొమ్మల కొలువు పెట్టడం వంటి పనులు చేస్తారు...వీటి ద్వారా జీవితంలో ఉన్న చెడు అంతా పోయి భోగభాగ్యాలు వస్తాయని విశ్వసిస్తారు. సంక్రాంతి రెండో రోజుని మార్పుకి సూచనగా భావిస్తారు. చేతికి అందిన పంటలతో పిండివంటలు చేసుకుని దేవతలకు కృతజ్ఞత చెబుతారు. పితృదేవతలని కూడా తల్చుకుంటారు. అందుకే ఈ రోజుకి పెద్దల పండుగ అన్న పేరు కూడా ఉంది. ఇక సంక్రాంతి మూడో రోజు కనుమ పశువుల పండుగ. ఇలా కనుమతోనే సంక్రాంతి సంప్రదాయాలన్నీ పూర్తయిపోతాయి. అందుకనే శాస్త్ర ప్రకారం అసలు ముక్కనుమ లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో నాలుగో రోజున గ్రామదేవతలకు బలిచ్చి మాంసాహారం వండుకుని తినే సంప్రదాయం ఉంది..అందుకే ఈ రోజుని ముక్కనుమ  అని పిలుస్తారు. అంతేకానీ ఈ రోజున ప్రయాణాలు చేయకూడదు అని కానీ, పండుగ చేసుకుని తీరాలి అని కానీ ఖచ్చితమైన నియమాలు ఏవీ లేవు!


నోట్: కొందరు పండితులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది..దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం