సంక్రాంతి వచ్చిందంటే ఇంట్లో నేతి స్వీట్లు ఘుమఘుమలాడాల్సిందే. ముఖ్యంగా బేసన్ లడ్డూ, మోతీచూర్ లడ్డూ, శెనగ పిండి లడ్డూ ఇవే కదా ఎక్కువగా చేసుకునేది. ఒకసారి చపాతీ లడ్డూలు కూడా చేయండి. రుచిలో వాటికి ఏమాత్రం తీసిపోవు. వీటిని నైవేద్యంగా కూడా దేవుళ్లకు ప్రసాదించవచ్చు. చపాతీ తయారయ్యేది గోధుమలతోనే కాబట్టి, గోధుమ లడ్డూ రుచిలా అనిపిస్తుంది. గోధుమపిండిలో ఉండే పోషకాలన్నీ ఇందులోనూ ఉంటాయి. ఇందులో బెల్లం కూడా వాడతాం కాబట్టి శరీరానికి ఐరన్ కూడా అందుతుంది.
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - ఒక కప్పు
బెల్లం తురుము - అర కప్పు
యాలకుల పొడి - పావు స్పూను
నెయ్యి - ఐదు స్పూన్లు
ఉప్పు - ఒక పావు స్పూను
తయారీ ఇలా
1. ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసుకోవాలి. అందులో ఉప్పు, నాలుగు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి.
2. నీటిని కూడా పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దానిపై మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి.
3. తర్వాత ఒక్కో ఉండని తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి.
4. స్టవ్ పై పెనం పెట్టి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
5. అలా అన్ని చపాతీలను చేసుకున్నాక చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేయాలి.
6. మరీ మెత్తగా కాకుండా, అలాగని కచ్చాపచ్చాగా కూడా కాకుండా రవ్వలాగా మిక్సీ పట్టాలి.
7. ఆ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
8. మిక్సీ జార్లో బెల్లం తురుమును కూడా వేసి మెత్తగా చేసుకోవాలి.
9.ఆ బెల్లాన్ని చపాతీల పొడిలో వేసి చేత్తో బాగా కలపాలి. చేతికి నెయ్యి రాసుకుంటే అంటకుండా ఉంటుంది.
10. అలాగే యాలకుల పొడిని కూడా వెయ్యాలి.మిగిలిన నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
11. తీపి సరిపోకపోతే బెల్లం తురుముని మరింతగా వేసుకోవచ్చు.
12. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చిన్నచిన్న ముద్దల్ని తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి.
13. టేస్టీ చపాతీ లడ్డూలు రెడీ అయినట్టే. రుచి అదిరిపోతుంది.
Also read: నోట్లో వేస్తే కరిగిపోయేలా నేతి బొబ్బట్లు - ఇలా చేస్తే సింపుల్