అత్యంత ప్రతిష్మాత్మకపై గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికపై ‘RRR’ సినిమా సత్తా చాటుకుంది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ‘నాటు.. నాటు..’పాట ఆస్కార్ కు ఎంట్రీగా భావించే ఈ  అవార్డును అందుకుంది. ఆ పాట‌కు సంగీతాన్ని అందించిన ఎంఎం కీర‌వాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ కేటగిరిలో అవార్డును అందుకున్న గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ‘RRR’ ఘనత సాధించింది.





 అటు ఈ అవార్డును అందుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు చెప్తున్నారు.


ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం- ప్రధాని మోదీ


‘RRR’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా యూనిట్ కు అభినందనలు తెలిపారు. సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్ ఎస్ రాజమౌళితో పాటు పాటకు సంగీతం అందించిన కీరవాణికి, పాట రాసిన చంద్రబోస్, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవను ప్రశంసించారు. ఈ పాటకు అద్భుతంగా నాట్యం చేసిన ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు సినిమా యూనిట్ ను అభినందనల్లో ముంచెత్తారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందని ప్రధాని అభిప్రాయపడ్డారు.






సీఎం జగన్‌ అభినందనలు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ కూడా ట్రిపుల్ ఆర్‌ టీమ్‌ను అభినందించారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందని... టీం మొత్తానికి రాష్ట్రం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. 






చంద్రబాబు అభినందనలు


ట్రిపుల్ ఆర్‌ చరిత్ర సృష్టించిందని... తెలుగు పవర్ చూపిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 






టీం మొత్తానికి బండి సంజయ్‌ కంగ్రాట్స్ చెప్పారు.






ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR’


ఇక 2022 మార్చి 24న విడుదలైన ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా..  రూ.1200 కోట్ల కలెక్షన్‌స్ సాధించింది. స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ దక్కింది.  రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ కీలక పాత్రలో పోషించిన ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌ అద్భుతంగా నటించి మెప్పించారు. జపాన్ లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. నిజానికి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు అనేవి ఆస్కార్ కు పునాదిగా భావిస్తుంటారు. ఇక్కడ అవార్డులు అందుకున్న చాలా సినిమాలు ఆస్కార్ ను సైతం అందుకుంటాయి. ఈ నేపథ్యంలో ‘RRR’ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో అస్కార్ అవార్డ్స్ వేదికపైనా సత్తా చాటుతుందని అందరూ భావిస్తున్నారు.   ఆస్కార్స్ లోనూ అవార్డును అందుకోవాలని సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు కోరుకుంటున్నారు.    


Read Also: ‘RRR’ టీమ్‌కు చిరంజీవి, రెహమాన్ అభినందనలు