Warangal Crime News: సోషల్‌ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్టులు.. యాక్సెప్ట్ చేస్తే... పరిచయం, ఆపై ఫోన్ నంబర్లు మార్పు, ఆతర్వాత వాట్సాప్ చాట్‌, వాట్సాప్ కాల్‌ ఆ వెనువెంటనే నీతో గడపాలని ఉందంటూ న్యూడ్ గా ఉండి అమ్మాయిలు వీడియో కాల్స్ చేస్తారు. వీడియో కాల్‌లో రెచ్చగొట్టే శృంగారపు సంభాషణ జరిపి పిచ్చెక్కిస్తారు. రెండు మూడు రోజుల్లోనే అబ్బాయిలే తరచుగా వారికి న్యూడ్‌కాల్స్ చేసుకునే విధంగా ట్రాప్‌ చేస్తారు. ఆ తర్వాత అసలు రూపం బయటపెడుతూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. అడిగినంత డబ్బులు ఇచ్చారా.. సరేసరి. లేదంటే.. నీ పరువు మొత్తం తీస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారు. బాధితుల కుటుంబ సభ్యులకు, బంధువులకు, ఈ న్యూడ్ కాల్స్ వీడియోలను పంపిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు విపరీతంగా భయపెడతారు. కొద్ది నెలలుగా ఈ తరహా న్యూడ్ కాల్స్ బెదిరింపులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పరువు పోతుందని, ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు డబ్బులు పొగోట్టుకోవడంతో పాటు మానసికంగా చితికిపోతున్నారు. జరుగుతున్న అనేక ఘటనల్లో పోలీస్‌స్టేషన్ వరకు చేరుతున్న కేసులు మాత్రం ఒకటి, రెండే కావడం గమనార్హం.


ఇలా చేస్తున్నారు..!


టార్గెట్ చేసుకున్న వ్యక్తుల ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రా గ్రామ్‌లతో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్లలోకి చొరబడుతున్న సైబర్‌గాళ్లు వారి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. టార్గెట్ చేస్తున్న వ్యక్తుల కాంటాక్ట్‌, బంధు మిత్రుల వివరాలను తీసుకుంటున్నారు. వివరాలను సోషల్ మీడియాల్లో రిక్వెస్ట్ చేస్తూ, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టెక్ట్స్ మెసేజ్‌ల్లో ఆకర్షించే విధమైన సమాచారం పంపుతున్నారు. ఇలా ఆకర్షితులైన వారు లింకులను క్లిక్ చేయగానే ఆన్‌లైన్‌లో చాటింగ్‌కు వస్తుంటారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో వ్యక్తులతో పరిచయం పెంచుకుంటున్న సైబర్‌గాళ్లు అమ్మాయిలతో వల విసురుతున్నారు.


ముందు వాట్సాప్ చాటింగ్‌తో మొదలు పెట్టి.. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకునేలా ప్రేరేపిస్తున్నారు. రోజుల వ్యవధిలోనే బాధితులకు నమ్మకం కుదిరేలా చేసి అమ్మాయిలచే న్యూడ్‌ కాల్స్ చేయించి మత్తెక్కిస్తారు. బాధితుడి చేత కూడా బట్టలిప్పేలా ప్రేరిపిస్తారు. దీంతో కొంతమంది వారు చెప్పినట్లుగా చేస్తుండటంతో సైబర్‌ నేరగాళ్లకు అడ్డంగా బుక్కవుతున్నారు. బాధితుల వీడియో చాటింగ్ దృశ్యాలను సీక్రెట్‌గా చిత్రికరించడం, వీడియో స్క్రీన్‌షాట్లను చేయడం చేస్తున్నారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే సదరు న్యూడ్ కాల్స్‌ వీడియోలను, చిత్రాలను మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు చేరుస్తామని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. దీంతో సైబర్‌గాళ్లు అడిగినంత డబ్బులను అందజేస్తున్నారు. అంతేకాదు అమాయకంగా చేసిన తెలివితక్కువ నికి మానసికంగా చితికిపోతున్నారు.


వీరే టార్గెట్‌..!


పరువు పోతుందని, సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు భయపడి లక్షలాది రూపాయలను పోగొట్టుకున్న బిగ్‌షాట్లు కూడా బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో యువత, ఉద్యోగులు, ఉన్నతాధికారులతో పాటు వ్యాపారులను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం.రాత్రి 10 గంటల తర్వాత సైబర్ కేటుగాళ్లు అమ్మాయిల చేత న్యూడ్ కాల్స్ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. హన్మకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ న్యూడ్ వీడియో కాల్ ఘటన వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వాస్తవానికి కొద్దికాలం క్రితం వరకు కూడా బ్యాంక్ కి సంబంధించి ఎక్కువగా మోసాలు జరుగుతుండేవి. అయితే రూట్ మార్చిన కేటుగాళ్లు వీడియో కాల్స్ ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌లకు దిగుతున్నారు.


భయం వద్దు పోలీస్‌శాఖ ఉంది: ఏసీపీ శ్రీనివాస్ 


సైబర్ నేరగాళ్లను తెలివిగా అడ్డుకోవాల్సిందేనని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను రిసీవ్ చేసుకోవద్దని సూచించారు. మన వ్యక్తిగత వివరాలను, బ్యాంకు అకౌంట్ల ఓటీపీ వివరాలు అడిగితే అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఈ మధ్య కాలంలో న్యూడ్ కాల్స్‌తో బెదిరింపులకు దిగుతున్నట్లుగా మా దృష్టికి కొన్ని సంఘటనలు వచ్చాయన్నారు. పొరపాటున ఇలాంటి మోసగాళ్ల బారిన పడినా బ్లాక్ మెయిల్స్ కి లొంగకుండా పోలీసులను ఆశ్రయించండని సూచించారు.