భారతీయ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరెక్కించిన చిత్రం ‘RRR’. దేశ విదేశాల్లోనూ సంచనల విజయం సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నో అవార్డులను దక్కించుకున్నది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ అవార్డును అందుకుంది.  2 కేటగిరీల్లో అవార్డు కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది. బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలోనూ అవార్డు కోసం పోటీ పడింది. అయితే, బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ‘RRR’ అవార్డును దక్కించుకుంది. ఆ పాట‌కు సంగీతాన్ని అందించిన ఎంఎం కీర‌వాణి ఆ అవార్డును అందుకున్నారు.






బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో ‘RRR’కు నిరాశ


అటు బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో మాత్రం  ‘RRR’కు నిరాశ ఎదురయ్యింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ‘అర్జెంటీనా1985’ గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకుంది.   బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో మొత్తం 5 సినిమాలు నామినేట్ అయ్యాయి.   ‘RRR’తో పాటు జ‌ర్మ‌నీకి చెందిన ‘ఆల్ క్వ‌యిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్‌’, అర్జెంటీనాకు చెందిన ‘అర్జెంటీనా 1985’, బెల్జియంకు చెందిన ‘క్లోజ్‌’, సౌత్ కొరియాకు చెందిన ‘డిసిష‌న్ టు లీవ్’ చిత్రాలు పోటీప‌డ్డాయి.ఇందులో ‘RRR’ విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ, ‘అర్జెంటీనా1985’ను అవార్డు వరించింది.  అర్జెంటీనాలోని సైనిక నియంత‌ల‌పై ఓ లాయ‌ర్ల బృందం తిర‌గ‌బ‌డిన క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.






ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటిన ‘RRR’


ఇక 2022 మార్చి 24న విడుదలైన ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా..  రూ.1200 కోట్ల కలెక్షన్‌స్ సాధించింది. స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ దక్కింది.  రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ కీలక పాత్రలో పోషించిన ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌ అద్భుతంగా నటించి మెప్పించారు. జపాన్ లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది.   


అస్కార్స్ కు ఎంట్రీ ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డులు!


నిజానికి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు అనేవి ఆస్కార్ కు పునాదిగా భావిస్తుంటారు. ఇక్కడ అవార్డులు అందుకున్న చాలా సినిమాలు ఆస్కార్ ను సైతం అందుకుంటాయి. ఈ నేపథ్యంలో ‘RRR’ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో అస్కార్ అవార్డ్స్ వేదికపైనా సత్తా చాటుతుందని అందరూ భావిస్తున్నారు. కాగా, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి తాజాగా బెస్ట్‌ డైరెక్టర్‌గా రాజమౌళి అవార్డును అందుకున్నారు. ఇక ఆస్కార్స్ లోనూ అవార్డును అందుకోవాలని సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ అవార్డుల వేదికపై తెలుగు దర్శకుడు సత్తా చాటాలని ఆశిస్తున్నారు.