Karnataka Election Results 2023:


ప్రచారంలో హనుమంతుడు..


కర్ణాటక ఎన్నికల్లో ఈ సారి హనుమంతుడూ ప్రచారంలో భాగమయ్యాడు. క్యాంపెయినింగ్ చివరి దశలో ఉండగా...కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో ఒక్కసారిగా అగ్గి రాజేసింది. బజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ (Bajrang Dal Ban) చేస్తామంటూ హామీ ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది. అప్పటి నుంచి అక్కడి రాజకీయాలన్నీ హనుమంతుడి చుట్టూనే తిరిగాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ జై బజ్‌రంగ్‌ బలి (Bajrang Bali) నినాదాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్‌పై యాంటీ హిందూ ముద్ర వేశారు. రాష్ట్రవ్యాప్తంగా బజ్‌రంగ్ దళ్‌ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీలను తగలబెట్టారు. బీజేపీ నేతలంతా కాంగ్రెస్‌కి గురి పెట్టారు. హిందువులను కాంగ్రెస్ కించపరిచిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది కాంగ్రెస్‌ని గట్టిగానే దెబ్బతీసింది. వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా స్పందించారు. బజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేసే ఆలోచనే లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. అయినా...అప్పటికి ఎంతో కొంత డ్యామేజ్ జరిగింది. కానీ...ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే ఈ ప్రచారాస్త్రం పెద్దగా పని చేయలేదనే స్పష్టమవుతోంది. సాధారణంగా బీజేపీ హిందూకార్డ్‌ని వాడుకుంటూ ప్రచారం చేస్తుంది. ఆ పార్టీకి కూడా అదే ముద్ర ఉంది. అయితే...కాంగ్రెస్ కామెంట్స్‌తో ఆ డోసుని పెంచింది. అంతే కాదు. 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదంటూ ఆ పాలనలోని స్కామ్‌లన్నింటినీ ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు ప్రధాని. ఎప్పటి కన్నా ఎక్కువగానే విమర్శలు చేశారు. వీటన్నింటిలో హైలైట్ మాత్రం "బజ్‌రంగ్ వివాదమే". 



ఎఫెక్ట్ ఎంత..? 


ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా ఒకటే కామెంట్ చేస్తున్నారు. "బజ్‌రంగ్ బలి అంశం ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు" అని తేల్చి చెబుతున్నారు. అసలు ప్రజలు ఆ  విషయాన్ని పట్టించుకోలేదని స్పష్టం చేస్తున్నారు. ఇది డైరెక్ట్‌గా బీజేపీకి కౌంటర్ ఇచ్చినట్టే. ఇక ముస్లిం రిజర్వేషన్ల రద్దుపైనా కాంగ్రెస్ పెద్దగా కామెంట్స్ చేయలేదు. కేవలం బీజేపీ హయాంలో జరిగిన అవినీతి గురించి మాత్రమే ఎక్కువగా ప్రచారం చేసింది. బజ్‌రంగ్ దళ్ వివాదాన్ని కూడా సాగదీయకుండా వెంటనే వివరణ ఇచ్చి నష్టాన్ని కొంత మేర తగ్గించుకుంది. అంతే కాదు. ఈ అంశం ఎంత మేర ప్రభావం చూపుతుందని సర్వే కూడా చేసింది. కోస్టల్ ఏరియాలోని నాలుగు చోట్ల మాత్రమే ఈ ఎఫెక్ట్ ఉంటుందని తేలింది. ఒకవేళ కాంగ్రెస్ నేతలు ఇదే హామీపై మళ్లీ మళ్లీ కామెంట్స్ చేసి ఉంటే..బహుశా అది కొంత మేర బీజేపీకి ప్లస్ అయ్యుండేదేమో. కాంగ్రెస్ మాత్రం చాలా బ్యాలెన్స్‌డ్‌గా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రచారం చేసింది. మధ్యలో ఓ సారి ఖర్గే ప్రధాని మోదీని "విషసర్పం" అంటూ చేసిన కామెంట్స్ కాస్త మిస్‌ఫైర్ అయినప్పటికీ...ఆయన వెంటనే వివరణ ఇచ్చి ఆ వివాదానికి తెర దించారు. ప్రచారం అంటే ఈ మాత్రం హాట్ కామెంట్స్ ఉండటం సహజం. కానీ...వాటిలో కొన్ని ఎన్నికల ఫలితాలనూ తారుమారు చేసేవి ఉంటాయి. బజ్‌రంగ్ దళ్ వివాదం ఆ లిస్ట్‌లో ఉంటుంది అనుకున్నా...ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే మరీ అంత ఎక్కువ ప్రభావం చూపించలేదని తెలుస్తోంది. చాలా చోట్ల కాంగ్రెస్‌ లీడ్‌లో ఉండడమే ఇందుకు నిదర్శనం. 



Also Read: Karnataka Election Results 2023: ట్రెండ్‌ ఫాలో అవుతున్న కన్నడ ఓటర్లు! అధికారంలో ఉన్న పార్టీకి గుడ్‌బై!