karnataka election results 2023 : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జెడి(ఎస్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి... కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారన్నారు. తమది చాలా చిన్న పార్టీ అని తమకు కొన్ని సీట్లే వస్తాయని అంచనా వేస్తున్నారని చెప్పారు. మరికొన్ని గంటల్లోనే దీనిపై క్లారిటీ వస్తుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఒక వేళ హంగ్ వచ్చే పరిస్థితి ఉంటే తాము కింగ్ మేకర్‌ అవుతామని తెలిపారు. 


ఈసారి కర్ణాటకలో ఎవరు గెలుస్తారో చూడాలని అందరి దృష్టి ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌పైనే ఉంది. మే 10న కర్ణాటకలో ఒకే దశలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 72 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, దూకుడుగా ఉన్న కాంగ్రెస్, దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. బెంగళూరు, సెంట్రల్, కోస్టల్, హైదరాబాద్-కర్ణాటక, ముంబై-కర్ణాటక, దక్షిణ కర్ణాటక లేదా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలోని ఆరు ప్రాంతాల్లో కీలక పోటీ ఉంది. ముంబై-కర్ణాటక, దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద ప్రాంతాలు వరుసగా 50, 51 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్నాయి.


ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో రెండు పార్టీల నేతలు ఫలితంపై ఉత్కంఠగా ఉన్నారు. హంగ్ వస్తుందని జెడి (ఎస్) అంచనా వేస్తోంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆఫర్ కూడా ప్రకటించింది. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్‌కు స్వల్ప మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.