Karnataka Results Effect :    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ల మద్య పోరు నడుస్తోంది. మూడు పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అయితే బి‌జే‌పి, కాంగ్రెస్ లకు మాత్రమే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జే‌డి‌ఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కర్ణాటకలో 113 సీట్లు మ్యాజిక్ ఫిగర్..ఆ సీట్లు తెచ్చుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. కర్ణాటకలో వచ్చే ఫలితాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.                                  
   
కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎంత ఉంటుంది ? 



రాజకీయాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు దాని పక్క రాష్ట్రంలో పడటం సర్వసాధారణం.  తెలంగాణలో కాంగ్రెస్‌ మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వారికి నైతిక ధైర్యం కావాలి. ఆ ధైర్యం కర్ణాటక ప్రజలు ఇస్తారని నమ్ముతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ నేతలు సంబరాలు చేసుకోవడం ఖాయం. సరిహద్దు ప్రాంతాల్లో ఆ ప్రభావం నేరుగా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా గెలిచే పార్టీ కాంగ్రెస్ అన్న భావన వస్తుంది.  రేవంత్ రెడ్డి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో ముందు నుంచీ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.            



కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకుంటే  బీజేపీకి అడ్వాంటేజ్ !


దక్షిణాదిన ఎదగాలనుకుంటున్న బీజేపీ కాలం కలసి రావడం లేదు. బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరు ఉంది.  కర్ణాటకలో మాత్రం రెండు మూడు సార్లు అధికారం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఆ పార్టీ ఎదురీదుతోందని సర్వేలు చెబుతున్నాయి.   దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ విస్తరించాలనుకున్న రాష్ట్రం తెలంగాణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలు దక్కించుకుంది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధిస్తామని చెబుతూ వస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ ఈజీగా గెలుస్తామని బీజేపీ చెబుతోంది. దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు మోదీ అమిత్ షా జేపీ నడ్డాలు ప్రత్యేక దృష్టి సారించారు. 



కర్ణాటకలో  ప్రతికూల ఫలితం వస్తే బీజేపీ జాగ్రత్త పడే చాన్స్ !


దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక. అక్కడ ఓడిపోతే సెంటిమెంట్ దెబ్బతింటుంది. గెలవకపోతే ఆ ఎఫెక్ట్ తెలంగాణ ఎన్నికల్లోనూ పడుతుంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని బీజేపీ అనుకుంటోంది. కానీ లీడర్ల కొరత ఎక్కువగా ఉంది.  అదే కర్ణాటకలో గెలిస్తే పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రతికూల ఫలితం వస్తే మాత్రం.. బీజేపీ నిరాశపడుతుంది. కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. అలాంటి సమయంలో బీజేపీ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ..  కూటమిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏపీలో పొత్తుల్ని కర్ణాటక ఫలితాలు డిసైడ్ చేసే చాన్స్ ఉంది.