Andhra Early Elections :  తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. జరుగుతాయా లేదా అన్నది డిసైడ్ చేయాల్సింది , చేసుకోవాల్సింది సీఎం జగన్ మాత్రమే. ఆయన ఆలోచనల ఎలా ఉన్నాయో కానీ కొన్ని సూచనలు మాత్రం ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయం కల్పిస్తున్నాయి. అలాంటివి పెరుగుతూండటంతో రాజకీయ  పార్టీలన్నీ డిసెంబర్‌లోనే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 


తెలంగాణతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించిన ఎన్నికల సంఘం 


తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఈమేరకు ఉమ్మడి ఎన్నికల గుర్తులకోసం పార్టీల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. రానున్న ఏడాది కాలంలో ఏపీ, తెలంగాణ సహా మిజోరాం, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, సిక్కిం, అరుణా చల్‌ప్రదేశ్‌, ఒడిస్సా అసెంబ్లి ఎన్నికలు జరగబోతు న్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. ఎలక్షన్‌ సింబల్స్‌ ఆర్డర్‌ 1968లోని పేరా 10 (బీ)ని అనుసరించి ప్రకటన విడుదల చేసింది. 2023-24లో జరగబోయే అసెంబ్లి , లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ఉమ్మడి గుర్తులకోసం దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావిడి పెరగనుంది. ఇప్పటికే ఊపందుకున్న ఏపీ, తెలంగాణ రాజకీయాలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


ఏపీకి ముందే ఎందుకు సన్నాహాలు -ఈసీకి సంకేతాలు ఇచ్చారా ?


ఏపీలో జమిలీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏదైనా సన్నాహాలు చేస్తే.. పార్లమెంట్ ఎన్నికలతోపాటే ఈసీ చేయాలి. కానీ ముందుగానే చేస్తోంది. తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ మొదటి వారంలో జరుగుతాయి. అంటే అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.  అదే నెలలో అసెంబ్లీని రద్దు చేస్తే.. ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. అంటే.. ఎన్నికల సంఘం ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ముందస్తు ఎన్నికలు జరపాలంటే... కనీసం రెండు నెలల ముందు అయినా అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈసీ సన్నాహాల కోసం మరికొంత సమంయ తీసుకుంటుంది.కానీ సీఎం జగన్ తెర వెనుక ప్రయత్నాల ద్వారా చివరిక్షణంలో రద్దు చేస్తామని..మీ సన్నాహాలు మీరు చేయండని ఈసీని ఒప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది.  


కేంద్రం సహకారం లభిస్తుందా ? 


ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. కేంద్రం కాదంటే జరిగే చాన్స్ లేదు. ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం కాదంటే మాత్రం.. రాష్ట్రపతి పాలన అయినా  విధిస్తారు కానీ ఎన్నికలు నిర్వహించరు. అయితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం సపోర్ట్ లభిస్తోందని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి ముందస్తుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారని ఆయన మీ ఇష్టం అన్నారన్న ప్రచారం జరుగుతోంది.  అక్టోబర్‌లో అసెంబ్లీని రద్దు చేస్తే .. రోజుల్లోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదు.  అంటే జగన్ ఆరు నెలల ముందే అధికారం కోల్పోతారు కానీ..  ఎన్నికలు జరగవు. అలాంటిది జరగుతుందని తెలిస్తే జగన్ చివరి క్షణంలో వెనుకడుగు వేస్తారని అనుకుంటున్నారు. మొత్తంగా ముందస్తు ఎన్నికల చర్చ మాత్రం మరోసారి ప్రారంభమయింది.