AP News: అకాల వర్షాలు రైతులను కుంగదీశాయి. చేతికి అందివచ్చిన పంట అకాల వానలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న పంటలకు సాయం అందిస్తామని వైసీపీ సర్కారు హామీ ఇచ్చింది. రికార్డు సమయంలోనే ఆ సాయం అందించినట్టు ప్రభుత్వం చెబుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొంది. ఒక్కరోజే 32,558 రైతుల ఖాతాల్లో రూ. 474 కోట్లు జమ చేసింది ఏపీ సర్కారు. దీనిపై ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఏపీ రాష్ట్ర సర్కారు నష్టపరిహార డబ్బు జమ చేసినట్లు వెల్లడించారు. రికార్డు సమయంలో రైతులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు సాయం అందించిందని పేర్కొన్నారు. కేవలం 5 రోజుల్లోనే డబ్బులు జమ చేసిందని చెప్పారు.
రబీలో ఇప్పటి వరకు రూ. 1,277 కోట్ల ధాన్యం డబ్బులను ఏపీ సర్కారు రైతుల ఖాతాల్లో జమ చేసింది. మొత్తంగా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. పరిహారం డబ్బులు ఖాతాల్లో జమ చేసేందుకు 21 రోజులు సమయం ఉన్నప్పటికీ కేవలం 5 రోజులకే పూర్తిగా చెల్లింపులు చేసింది వైఎస్సార్ సర్కారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు 527 కోట్ల రూపాయలు, ఏలూరు జిల్లా రైతులకు రూ. 296 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా రైతులకు రూ. 258 కోట్లు, కోనసీమ జిల్లా రైతులకు రూ. 100 కోట్లు జమ చేసినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు.