Karnataka Muslim Quota:
ముస్లిం రిజర్వేషన్లు రద్దు
కేంద్రహోం మంత్రి అమిత్‌షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ముస్లింల రిజర్వేషన్‌లు రద్దు చేస్తూ మార్చిలో అమిత్‌షా చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు. దేశ రాజ్యాంగంలోని సెక్యులరిజాన్ని దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించారు. బీజేపీ కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతోందని మండి పడ్డారు. మైనార్టీల మీద వాళ్లకు ఎంత విద్వేషముందో ఇలాంటి ప్రకటనలే చెబుతాయని తేల్చి చెప్పారు. కేవలం ఎన్నికల్లో ఓట్లు రాల్చుకునేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్...ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మార్చిలో కర్ణాటకలో ముస్లింలకు కేటాయించిన 4% రిజర్వేషన్‌లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కోటాను లింగాయత్‌లు, వొక్కళిగలు సమానంగా పంచింది. సోషల్ మీడియా,న్యూస్ ఛానల్స్‌ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని బీజేపీ ఆటలాడుతోందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ముస్లింలపై విద్వేషం పెంచితే హిందువులకు రక్షణ దొరుకుతుందన్న భ్రమలో ఉన్నారు బీజేపీ నేతలు. కానీ అది నిజం కాదు. బీజేపీకి ఓటు వేయని వాళ్లలో మెజార్టీ హిందువులే ఉంటారు. హిందువులు, ముస్లింలు సోదరుల్లా కలిసి మెలిసి ఉంటున్నారు. కానీ బీజేపీ ఉద్దేశపూర్వకంగా వీళ్లలో విద్వేషాలు రెచ్చగొడుతోంది. కావాలనే ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తోంది. సోషల్ మీడియాలో బీజేపీకి మద్దతుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఛానళ్లు కూడా వాటికే సపోర్ట్ ఇస్తున్నాయి. మొత్తంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రే ముస్లిం రిజర్వేషన్ల రద్దు గురించి ప్రస్తావించడం భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమే"
- స్టాలిన్, తమిళనాడు సీఎం
కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా.. అధికార బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆ వర్గానికి ఉన్న 4శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసిన బొమ్మై ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో ముస్లింలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విభాగంలో 10శాతం రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. మరోవైపు.. ముస్లింలకు రద్దు చేసిన 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాలకు కేటాయించనున్నారు.