Man Found in Crocodiles:
ఆస్ట్రేలియాలో ఘటన..
చేపల వేట కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు ఎంత గాలించినా దొరకలేదు. ఎక్కడా కనిపించలేదు. చివరకు డెడ్‌బాడీ దొరికింది. ఎక్కడో తెలుసా..? రెండు మొసళ్లలో. ఈ షాకింగ్ ఘటన...ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌ల్యాండ్‌లో జరిగింది. మూడు రోజుల క్రితం కెవిన్ డార్మొడీ చేపలు పట్టేందుకు ఓ చెరువులోకి వెళ్లాడు. అక్కడ మొసళ్లు కనిపించాయి. వెంటనే వాటిని తరిమి కొట్టాడు. అవి వెళ్లిపోయాక చేపలు పట్టడం మొదలు పెట్టాడు. ఆ పక్కనే ఓ పబ్ ఉంది. ఆ పబ్ మేనేజర్‌కి ఉన్నట్టుండి పెద్దగా అరుపులు వినిపించాయి. నీళ్ల చప్పుడు కూడా వినిపించింది. బయటకు వచ్చి చూసే సరికి ఆ వృద్ధుడు కనిపించలేదు. అక్కడ మొసళ్లు తిరుగుతున్న విషయాన్ని గుర్తించిన రేంజర్లు వెంటనే నీళ్లలోకి దిగారు. ఆ రెండింటినీ కాల్చి చంపేశారు. వాటిలో ఒకటి 14 అడుగుల పొడవు ఉండగా...మరోటి 9 అడుగుల పొడవు ఉంది. చేపల వేటకు వచ్చే వారిని ఇవి చంపేస్తున్నాయని గుర్తించారు. వేటాడి చంపేశారు. ఆ రెండు మొసళ్లను ఎగ్జామిన్ చేయగా...వాటి కడుపులో ఆ వృద్ధుడి శరీర భాగాలు కనిపించాయి. ఆ ప్రాంతంలో మొసళ్లు ఎక్కువ అని పోలీసులు వెల్లడించారు. అందుకే నీళ్లలోకి వెళ్లే ముందే జాగ్రత్త పడాలని సూచించారు. మొసళ్ల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందుకే వాటి సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో..
మొసలి ఓ పిల్లాడిని మింగేసిందన్న కోపంతో మొసలిని 7 గంటల పాటు బంధించారు గ్రామస్థులు. మధ్యప్రదేశ్‌లోని రఘునాథ్‌పూర్ గ్రామ ప్రజలు చేసిన ఈ పనికి అటవీ అధికారులు షాక్ అయ్యారు. మొసలి కాళ్లను కట్టేసి, నోరు మూసివేసే వీల్లేకుండా అలాగే 7 గంటల పాటు ఉంచారు. మొసలి కడుపులో ఉన్న బాలుడు బయటకి వస్తాడన్న నమ్మకంతో, అన్ని గంటల పాటు మొసలి నోరు మూయకుండా కట్టడి చేశారు. చంబల్ నదిలోకి స్నానం చేసేందుకు బాలుడు దిగాడని, ఆ సమయంలో మొసలి మింగేసిందని గ్రామస్థులు వాదిస్తున్నారు. మరో విచిత్రం ఏంటంటే మొసలి కడుపులో ఆ బాలుడు బతికే ఉన్నాడని ఫిక్స్ అయ్యారు అంతా. ఆ బాలుడి పేరు పిలుస్తూ, బదులు కోసం ఎదురు చూశారట. అప్పటికే అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు గ్రామస్థలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. "మీరు అనుకున్నది సాధ్యం కాదు" అని వివరించారు. గతేడాది జులైలో జరిగిందీ ఘటన.
"నదీ తీరంలో బాలుడు స్నానం చేస్తున్నాడు. ఉన్నట్టుండి మొసలి దాడి చేసింది. మొసలికి చిక్కకుండా ఉండేందుకు చాలా వేగంగా ఈదాడు. అయినా మొసలి బాలుడిని పట్టుకుంది. ఆ సమయంలో పిల్లాడు గట్టిగా అరిచాడు. వెంటనే మేమంతా ఇక్కడికి వచ్చాం" అని వివరిస్తున్నారు స్థానికులు. వలల సాయంతో మొసలిని పట్టుకున్నారు. గ్రామస్థులకు నచ్చచెప్పి మొసలిని నీళ్లలో వదిలే సరికి, అధికారుల తలప్రాణం తోకకు వచ్చింది. అయితే మరుసటి రోజు ఆ బాలుడి మృతదేహం నదిలో కనిపించింది.