Bajrang Dal Ban:


మేనిఫెస్టో తగలబెడుతూ నిరసనలు..


కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ఓ హామీ ఇప్పుడక్కడ పెద్ద దుమారమే రేపింది. తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్‌ని  బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. దీనిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు మండి పడుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని తగలబెడుతూ ఆందోళనలు చేపడుతున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్‌తో పాటు కర్ణాటకలోని మంగళూరులోనూ ప్రొటెస్ట్ చేశారు. తక్షణమే ఆ హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది తామే అన్న కాన్ఫిడెంట్‌తో ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ మాత్రం డబుల్ ఇంజిన సర్కార్‌ కావాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించండి అని ప్రచారం చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ రాజకీయాల్ని వేడెక్కించింది. భజరంగ్ దళ కార్యకర్తలకు కొందరు బీజేపీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. వెంటనే ఆ హామీని వెనక్కి తీసుకోవాలని తేల్చి చెబుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భజరంగ్ దళ్, PFI లాంటి సంస్థల్ని బ్యాన్ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ సంస్థలు సమాజంలో విద్వేషాలు రెచ్చ గొడుతున్నాయని ఆరోపించింది. అందుకే వాటిపై నిషేధం విధించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. RSSకి అనుబంధ సంస్థ అయిన భజరంగ్ దళ్‌...కాంగ్రెస్ వైఖరిపై మండి పడుతోంది. తమ సంస్థ దేశానికే గర్వకారణమని అంటోంది. 


"దేశభక్తిని అందరిలోనూ రగిలించే గొప్ప సంస్థ భజరంగ్ దళ్. ఈ సంస్థ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. పవిత్రమైన గోవులను సంరక్షిస్తోంది. దేశంలోని లక్షలాది మందికి రక్తదానం చేస్తోంది. మా సంస్థ దేశానికే గర్వకారణం. కానీ కాంగ్రెస్ మాత్రం మా సంస్థను PFIతో పోల్చుతోంది. ఇలా పోల్చడం ఆత్మహత్యలాంటిదే. కాంగ్రెస్ ఉగ్రవాదులతో చేతులు కలుపుతోంది. భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ యాంటీ హిందూ అని మరోసారి రుజువు చేసుకుంది. అధిష్ఠానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. వెంటనే ఈ హామీని వెనక్కి తీసుకోవాలి"


- వీహెచ్‌పీ ప్రతినిధి 






బీజేపీ ఉచిత హామీలు..


ఇక బీజేపీ విషయానికొస్తే...మేనిఫెస్టోలో మొత్తం  16 ప్రధాన హామీలు..103 ముఖ్యమైన హామీలు ఉన్నాయి.  ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఘనంగా ప్రకటించింది. ఉగాధి, వినాయకచవితి, దీపావళి పండగ కానుకగా ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని మ్యానిఫెస్టోలో తెలిపింది. ఇక ఎన్నికల ప్రకటన విడుదలకు ముందు కన్నడ సీమలో రచ్చరచ్చగా మారిన పాలు, పెరుగు వివాదంలో ఓటర్లను శాంతించే రీతిలో పోషణ పథకం కింద ఉచితంగా పాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.  పెరుగును దహీ అనాలని.. నందిని మిల్క్‌ డెయిరీకి ప్రత్యామ్నాయంగా అమూల్‌ పాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పోషణ పథకం కింద ఉచితంగా నందిని పాలు పంపిణీ చేస్తామని కన్నడిగుల ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కాషాయ నేతలు. 


Also Read: Wrestlers Protest: మోదీజీ మా మన్‌ కీ బాత్ వినండి, మంత్రిని కలిసి ఏడ్చినా న్యాయం జరగలేదు - రెజ్లర్ వినేష్ ఫోగట్