Wrestlers Protest:
అనురాగ్ ఠాకూర్‌పై ఫైర్
రెజ్లర్లు వర్సెస్ బ్రిజ్ భూషణ్ సింగ్ వివాదం ఇంకా సద్దుమణగలేదు. రోజుకో కొత్త డిమాండ్ వినిపిస్తున్నారని బ్రిజ్ భూషణ్ ఆరోపిస్తున్నారు. అటు రెజ్లర్లు మాత్రం కచ్చితంగా విచారణ జరిపించాలని తేల్చి చెబుతున్నారు. ఆయన అన్ని పదవులకూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై బ్రిజ్ భూషణ్ స్పందించి...తన తరపున వాదన వినిపించారు. అప్పటి నుంచి ఈ వివాదం ఇంకా ముదిరింది. ఈ క్రమంలోనే వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్ భూషణ్‌పై కేసులు నమోదు చేసినప్పటికీ వాటిని కొట్టేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా బ్రిజ్ భూషణ్‌కు మద్దతుగా నిలుస్తున్నారని మండి పడ్డారు. కమిటీ ఏర్పాటు పేరుతో కేసుని పక్కదోవ పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా పవర్‌ఫుల్‌గా ఉన్న బ్రిజ్ భూషణ్‌ని ఎదుర్కోడం కష్టంగా ఉందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అధిరాకాన్ని దుర్వినియోగం చేస్తున్న అలాంటి వ్యక్తితో పోరాటం అంత సులభం కాదని తేల్చి చెప్పారు. అయినా న్యాయం జరిగే వరకూ పోరాడతామని వెల్లడించారు.
"రాజకీయ బలం ఉన్న బ్రిజ్ భూషణ్ సింగ్ లాంటి నేతలపై పోరాటం చేయడం అంత సులువు కాదు. ఎన్నో ఏళ్లుగా ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మా ఆరోపణల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కఠిన చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తుంటే కమిటీ పేరుతో కేసుని తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారు"
- వినేష్ ఫోగట్, రెజ్లర్
నాలుగు నెలల క్రితమే ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, ప్రతి ఒక్క మహిళా రెజ్లర్ ఏదో విధంగా లైంగిక వేధింపులకు గురయ్యారని తేల్చి చెప్పారు వినేష్ ఫోగట్. తాము ఆరోపణలు చేసిన ప్రతిసారీ వాటిని దాచి పెట్టేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నాలుగు నెలల క్రితం మేం ఆరోపణలు చేశాం. మా బాధ మేం చెప్పుకున్నాం. అప్పటికప్పుడు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తరవాత ఆ ఊసే మరిచిపోయారు. ఈ నాలుగు నెలల్లో జరిగిందేమీ లేదు. అందుకే మరోసారి మేం జంతర్‌మంతర్ వద్దకు వచ్చాం. ఇప్పటికే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ని కలిశాం. లైంగిక వేధింపుల గురించి చెప్పాం. ఆ బాధను తట్టుకోలేక ఏడ్చేశాం. అయినా ఇంత వరకూ ఎలాంటి న్యాయం జరగలేదు. నేషనల్ క్యాంప్ సమయంలోనే మేం మా బాధలన్నింటినీ చెప్పాం. కానీ WFI వాటిని దాచేసి అంతా బాగుందన్నట్టుగా నటించింది. కమిటీ వేయడం మినహా అనురాగ్ ఠాకూర్ చేసిందేమీ లేదు. ఇదంతా మా గొంతు నొక్కే ప్రయత్నమే. కేసుని బలహీనపరిచేందుకు మాత్రమే కమిటీ వేశారు. మా మన్‌కీ బాత్ వినాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం స్మృతి ఇరానీ కూడా మా బాధని అర్థం చేసుకోవడం లేదు."
- వినేష్ ఫోగట్, రెజ్లర్
Also Read: Aadhar: మీ ఆధార్‌తో ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయిందో గుర్తు లేదా?, కనుక్కోవడం చాలా ఈజీ