నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ పయనం
ఢిల్లీలో నిర్మించిన బీఆర్‌ఎస్ నూతన కార్యాలయాన్ని గురువారం (మే 4) అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్‌గా మారిన అనంతరం పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందు కోసం కేసీఆర్ ఇవాళ(బుధవారం) కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఉత్తరాంధ్రలో జగన్ పర్యటన
ముఖ్యమంత్రి జగన్ బుధవారం ముందుగా విశాఖలో పర్యటించనున్నారు. అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ అదానీ కూడా పాల్గొనబోతున్నారు. మధురవాడలో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్క్‌లో అదానీ సంస్థ 14,634 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సీఎం జగన్ తాడేపల్లిలో బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ గౌతమ్ అదానీని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడ మధురవాడలో ఏర్పాటు చేయబోయే టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. విశాఖ పర్యటన అనంతరం విజయనగరంలో పర్యటిస్తారు. బుధవారం భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 3,500 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. 2025 సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.
హైదరాబాద్‌లో నీరా కేఫ్
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నీరాకేఫ్ బుధవారం ప్రారంభం కానుంది. నెక్లెస్ రోడ్డులో ఆధునిక హంగులతో నిర్మించిన ఈ కేఫ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
12.20 కోట్ల రూపాయలతో ఈ కేఫ్‌ను తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లోనే కాకుండా వివిధ జిల్లాల్లో కూడా నీరాకేఫ్‌లకు నిధులు మంజూరు చేసింది. భువనగిరిలోని నందనం, రంగారెడ్డిలోని ముద్విన్, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్గొండలోని సర్వేల్‌లో ఒక్కో నీరాకేఫ్‌కు 8 కోట్ల చొప్పున నిధులు ఇచ్చింది. ఈ కేఫ్‌ల నిర్వాహణకు గీత కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది ప్రభుత్వం. మూడు వందల మందికి ఇందులో తర్ఫీదు ఇచ్చి రెడీ చేసింది.
నేడు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం
జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశం నేడు జరగనుంది. కుక్కకాట్లు, వరదలు, నాలాల్లో పడిపోతున్న జనం ఇలాంటి ఘటనలు జరుగుతున్న టైంలో ఈ భేటీ హాట్‌హాట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. కీలక అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే ఛాన్స్ ఉంది. అందుకు దీటుగానే అధికార పక్షం రెడీ అయింది. మూడు నెలలకోసారి జరగాల్సిన సమావేశం నెల రోజులు ఆలస్యంగా జరుగుతోంది.
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించనున్నారు. ఈ మేరకు ఆయన సిరిసిల్ల జిల్లాలలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బండి సంజయ్ పర్యటన ప్రారంభంకానుంది. ముందుగా గంభీరావ్‌పేట్ మండలంలోని నాగంపేటలో పంటలు పరిశీలిస్తారు. అనంతరం మిడ్‌మానేరు ముంపు బాధితులను పరామర్శిస్తారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేడు రాస్తోరోకోలు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మలి దశ ఉద్యమానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమైంది. ఈ మేరకు ఈ ఉదయం రాష్ట్రంలో రాస్తారోకోలకు పిలుపునిచ్చింది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రాష్ట్రంలోని రోడ్లను స్తంభింపజేయాలని ఆలోచన చేస్తోంది. దీనికి అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించింది. గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి హైవేలను ముట్టడించాలని స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనికి విరుగుడు చర్యలు తీసుకుంది. ముఖ్యమైన నాయకులను ఎక్కడికక్కడే కట్టడి చేస్తూ ముందస్తు అరెస్టు చేస్తున్నారు.
ఐపీఎల్‌లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీ
ఐపీఎల్ 2023లో బుధవారం డబుల్ హెడర్ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి పోరులో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ (LSG vs CSK) తలపడుతున్నాయి. ఈ రెండు టీమ్స్ తలపడ్డ మొదటి పోరులో ధోనీసేన గెలిచింది. మరి లక్నో ప్రతీకారం తీర్చుకోగలదా?
రాహుల్ ఆడగలడా!
లక్నో సూపర్ జెయింట్స్‌కు (Lucknow Super Giants) భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) గాయపడ్డాడు. అతడి పరిస్థితి ఏంటో తెలియదు! బహశా ఈ మ్యాచులో ఆడకపోవచ్చు! మరి అతడి ప్లేస్‌ను రిప్లేస్ చేసిది ఎవరో చూడాలి. పంజాబ్‌పై 250+ చేసిన రాహుల్ సేన బెంగళూరుపై 120+ టార్గెట్ ఛేదించలేకపోయింది. అందుకే ఈ పోరు అత్యంత కీలకం! ఏకనా స్టేడియం పిచ్‌లు అంచనాలకు అందడం లేదు. దాంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్య పెద్ద ఇన్నింగ్సులు ఆడాలి. మిడిలార్డర్ భారం స్టాయినిస్, నికోలస్ పూరన్‌పై ఉంది. కైల్ మేయర్స్ పవర్ ప్లే మొత్తం ఆడేలా జాగ్రత్తపడాలి. బౌలింగ్ పరంగా ఇబ్బందులేమీ లేవు. ఇండియన్, ఫారిన్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. రవి బిష్ణోయ్, గౌతమ్, పాండ్య, మిశ్రా స్పిన్ బాగుంది.
గెలిస్తే సెకండ్ ప్లేస్!
చైన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings) సైతం చివరి మ్యాచులో ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్ చెపాక్‌లో 200+ టార్గెట్‌ను ఆఖరి ఓవర్లో ఛేజ్ చేసింది. అయితే బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ బలంగా ఉంది. డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌లో (Ruturaj Gaikwad) ఒకరు కాకుంటే మరొకరు దూకుడుగా ఆడుతున్నారు. భారీ భాగస్వామ్యాలు అందిస్తున్నారు. అజింక్య రహానె సైతం ఫామ్‌లోనే ఉండటం ఫ్లెక్సిబిలిటీ పెంచింది. మిడిలార్డర్లో శివమ్ దూబె, రవీంద్ర జడేజా దంచికొడుతున్నారు. అంబటి రాయుడు ఇంకా సెట్టవ్వలేదు. మొయిన్ అలీ ఫర్వాలేదు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) దొరికినప్పుడు బాదేస్తున్నాడు కానీ మిగతా మ్యాచులో అలా ఉండటం లేదు. బౌలింగ్ పరంగా సీఎస్కే ఇబ్బంది పడుతోంది. అనుభవం లేని కుర్ర పేసర్లు ఒత్తిడికి గురవుతున్నారు. దేశ్‌పాండే వికెట్లు అందిస్తున్నా ప్రెజర్ ఫీలవుతున్నాడు. పతిరన బౌలింగ్ యాక్షన్ బాగుంది. స్పిన్ పరంగా సీఎస్కే ఫర్వాలేదు. పేస్ బౌలింగ్ విభాగంలోనే క్లిక్ అవ్వడం లేదు. రెండు జట్లు 10 పాయింట్లతో ఉండటంతో గెలిచిన వాళ్లు 12 పాయింట్లతో రెండో ప్లేస్‌కు చేరుకుంటారు.