విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టుకు నేడు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించిన ఏర్పాట్లును అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపనకు వచ్చే ముఖ్యమంత్రి జగన్ సవరవిల్లి వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మూడేళ్లలోనే తొలి విమానాన్ని భోగాపురం రన్‌వేపై నడపాలన్న లక్ష్యంతో ఉన్నట్టు నిర్మాణ సంస్థ జీఎంఆర్ పేర్కొంది. దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఒకేసారి ఇరవైకి పైగా విమానాలు దిగేలా ఈ ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దనున్నారు. మూడు దశల్లో దీన్ని పూర్తి చేయనుంది. మొదటి దశలో 60 లక్షళ మంది, రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించేలా నిర్మించనున్నారు.
ఈ పర్యటనలో సీఎం జగన్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రెండు నీటి ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారు. చంపావతి నదిపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు, తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్టును పరిశీలిస్తారు. 49 గ్రామాలకు తాగునీటితోపాటు భోగాపురం ఎయిర్‌పోర్టుకు అవసరమైన నీటిని అందివ్వ నుంది తారకరామ తీర్ధ ప్రాజెక్టు. వీటిని 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు.
తర్వాత పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో 23.73 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. అన్ని సీజన్స్‌లో చేపలు వేటాడేందుకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.
అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడలో కూడా మరో వంద మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌ను శంకుస్థాపన చేస్తారు. ఈ రెండు పార్క్‌ల వల్ల సుమారు 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.