Go First Airlines: వాడియా గ్రూప్‌నకు (Wadia Group) చెందిన గోఫస్ట్‌ ఎయిర్‌లైన్స్ అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నెల 3, 4 తేదీల్లో తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ ఎయిర్‌లైన్స్‌, దివాలా పరిష్కార ప్రక్రియ కోసం (bankruptcy) జాతీయ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLT) దిల్లీ బెంచ్‌కి స్వచ్ఛందంగా దరఖాస్తు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఎటువంటి నోటీసు లేకుండా విమానాలను రద్దు చేసి, ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసింనందుకు ఈ కంపెనీ DGCA షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. 


గోఫస్ట్‌‌ అప్పులెంత?
గోఫస్ట్‌‌, తన రుణదాతలకు భారీగా బకాయిలు పడింది. దివాలా ప్రక్రియ కోసం దాఖలు చేసిన పత్రాల ప్రకారం, ఆర్థిక రుణదాతలకు ఇప్పటికిప్పుడు ₹6,521 కోట్లు (798 మిలియన్‌ డాలర్లు) చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ బకాయిల్లో దేనినీ ఏప్రిల్ 30 వరకు డిఫాల్ట్ చేయలేదని తన ఫైలింగ్‌లో ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.


దివాలా పరిష్కార ప్రక్రియ పత్రాల ప్రకారం, GoFirst ఆర్థిక రుణదాతల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDBI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డ్యూయిష్ బ్యాంక్ ఉన్నాయి. ఈ రుణదాతలందరికీ ఎయిర్‌లైన్స్‌ కట్టాల్సిన మొత్తం రూ. 11,463 కోట్లుగా ఫైలింగ్‌ ద్వారా తెలుస్తోంది. ఈ మొత్తంలో.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చమురు విక్రేతలు, విమానాలు అద్దెకు ఇచ్చిన కంపెనీల బకాయిలు కూడా కలిసి ఉన్నాయి.


భారీ నష్టాల్లో గోఫస్ట్‌
విమాన ఇంజిన్లలో సమస్యల కారణంగా 50 శాతం విమానాలు నడవడం లేదని గోఫస్ట్‌ ఇండియా లిమిటెడ్ (Go First Airlines) వెల్లడించింది. గోఫస్ట్‌ ఆధీనంలో ఉన్న మొత్తం 57 విమానాల్లో 28 విమానాలను ప్రస్తుతం గ్రౌండ్‌కే పరిమితం అయ్యాయి. అంతే కాకుండా ఖర్చు కూడా రెట్టింపు అయింది. తమ ఆర్థిక పరిస్థితి దిగజారడం వల్ల అప్పులను తీర్చలేకపోయామని ఈ కంపెనీ చెబుతోంది. ఈ పరిస్థితుల్లోనే NCLT ముందుకు వెళ్లాల్సి వచ్చిందని, NCLT తమ దరఖాస్తును అంగీకరిస్తే మళ్లీ విమానాలు నడుపుతామని గోఫస్ట్‌‌ తెలిపింది.


2005లో, వాడియా గ్రూప్‌, చౌక ధరల విమానాయాన సంస్థగా గోఫస్ట్‌‌ ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత రెండేళ్లలోనే ఇది దేశంలో ఐదో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌గా నిలిచింది. అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఈ కంపెనీ రెక్కల్ని కరోనా విరిచేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నష్టాలు ప్రారంభమయ్యాయి. గత 3 ఆర్థిక సంవత్సరాల్లోనూ నష్టాల్లోనే ఉంది, మొత్తం నష్టాలు దాదాపు రూ. 4,000 కోట్లకు చేరాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ఈ కంపెనీ నష్టాల్లోనే ఉంది, ఆ ఫలితాలను ఇంకా ప్రకటించలేదు. దీంతోపాటు, ఈ విమానాలకు ఇంజిన్లను సరఫరా చేసిన అమెరికాకు చెందిన ప్రాట్‌ అండ్‌ విట్నీ సరఫరా చేసింది. ఇంజిన్లలో తలెత్తిన సమస్యల్ని సరి చేయడంలో ఆ సంస్థ సకాలంలో స్పందించకపోవడం వల్ల కూడా గోఫస్ట్‌‌ ఎయిర్‌లైన్స్‌ చాలా నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.


ఫలించని ప్రమోటర్‌ గ్రూప్‌ ప్రయత్నాలు
సంస్థను నిలబెట్టడానికి, ప్రమోటర్‌ అయిన వాడియా గ్రూప్‌ చాలా ప్రయత్నాలు చేసింది. సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు, గోఫస్ట్‌ ప్రమోటర్ల ద్వారా రూ .6,500 కోట్లు కంపెనీలోకి వచ్చాయి. గత మూడేళ్లలో రూ. 3,200 కోట్లు సమకూర్చింది. ఇందులో రూ. 2,400 కోట్లు గత రెండేళ్లలోనే వచ్చాయి. గత నెలలో కూడా రూ. 290 కోట్లను వాడియా గ్రూప్‌ కంపెనీలోకి చొప్పించింది. దీంతోపాటు, కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర రుణ హామీ పథకాన్ని కూడా ఈ కంపెనీ వినియోగించుకుంది. ఇవేమీ ఈ ఎయిర్‌లైన్స్‌ను స్వేచ్ఛగా ఎగిరేలా చేయలేకపోయాయి.