Bharat Jodo Yatra Delhi:


ఢిల్లీలో రాహుల్‌తో పాటు కమల్ యాత్ర..


రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకుంది. ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర ఈయాత్ర కొనసాగింది. జనవరి చివరి నాటికి కశ్మీర్‌లో ముగియనుంది. అయితే...ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీతో ఓ ప్రత్యేక అతిథి కలిసి నడిచారు. ఆయన ఎవరో కాదు. సీనియర్ నటుడు కమల్ హాసన్. కమల్ హాసన్, రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి యాత్రను ఎర్రకోట వరకూ కొనసాగించారు. ఆ తరవాత అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నన్ను చాలా మంది అడిగారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని.  నేను ఓ భారతీయుడిగా ఇక్కడికి వచ్చాను. మా నాన్న కాంగ్రెస్‌ లీడర్. రాజకీయాలపై నాకంటూ ప్రత్యేకమైన ఐడియాలజీ ఉంది. అందుకే కొత్త పార్టీ స్థాపించాను. కానీ...దేశ ఐక్యత అనే విషయంలో మాత్రం రాజకీయాలు దాటుకుని రావాలి. ఆ సరిహద్దుల్ని చెరిపేయాలి. నేను ఆ గీతను చెరిపేసి ఇక్కడికి వచ్చాను" అని స్పష్టం చేశారు కమల్ హాసన్. గత వారమే తన పార్టీ నేతలతో రాహుల్ గాంధీ తనను ఇన్వైట్ చేసినట్టు కమల్ హాసన్ చెప్పారు. "అద్దం ముందు నించుని నన్ను ప్రశ్నించుకున్నాను. దేశానికి నీ అవసరం ఉంది అని నా అంతరాత్మ నాతో చెప్పింది. భారత్‌ ముక్కలవడం సరి కాదు. ఐకమత్యంగా ఉండాల్సిన సమయం ఇది" అని అన్నారు. 






కేంద్రంపై రాహుల్ ఫైర్...


ఆ తరవాత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. మోడీ సర్కార్‌పై మండి పడ్డారు. కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం కాదని...అంబానీ, అదానీ ప్రభుత్వం అని విమర్శించారు. "దేశం మొత్తానికి తెలుసు. కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్ కాదు అంబానీ అదానీ ప్రభుత్వం అని. జోడో యాత్రలో భాగంగా నేను 2,800 కిలోమీటర్ల మేర నడిచాను. అందరితో మమేకమయ్యానను. నాకెక్కడా విద్వేషం, హింస కనిపించలేదు. కావాలనే బీజేపీ విద్వేశాలను రెచ్చగొడుతోంది. నిజమైన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఇలా చేస్తోంది" అని ఆరోపించారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు. "నేను ఒక్క మాట కూడా మాట్లాడను. వాళ్లకెంత పవర్ ఉందో చూడాలని అనుకుంటున్నాను" అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.  


Also Read: Covid-19 India: భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా? ఆ అవసరం కనిపిస్తోందా?