Chandrababu : టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు స్వర్ణయుగంలా ఉండేదని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఏపీ అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న ఆయన... బొబ్బిలిలో ఇదేం ఖర్మ మన రైతులకు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ సమయంలో రైతన్నలు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చర్యలు చేపట్టా్మన్నారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించారు. రైతులపై వాలంటీర్ల పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్బీకేలను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కిందా? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని విమర్శించారు. రైతుల పంటను మొబైల్ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశం కల్పించామని గుర్తుచేశారు. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టింది టీడీపీ అని చంద్రబాబు అన్నారు. డ్వాక్రా సంఘాలతో కల్లాల వద్దే పంట కొనుగోలు చేశామన్నారు. సింగిల్ విండో విధానంతో రైతులకు ఉపయోగపడే చర్యలు చేపట్టా్మన్నారు.
ఆర్బీకేలతో ఉపయోగం ఏంటి?
"ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహించేవాళ్లం. ఇప్పుడు మీ పట్టుదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో పెడుతున్నారు. మీ ఆస్తిపై ఆ బొమ్మ ఏంటి? సర్వే రాళ్లపై కూడా జగన్ ఫొటో పెడతారంట. అందుకే సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలి. నేను కొత్త విషయాలను నేర్చుకుంటాను. ఎన్నో వ్యవస్థలున్నాయి. వాటిని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాం. అంతే కానీ పాత వ్యవస్థలను రద్దు చేయలేదు. జగన్ ఆయనే మొదట ముఖ్యమంత్రి అయినట్లు ప్రవర్తిస్తున్నారు. వాలంటీర్లు రైతులపై పెత్తనం చేస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం. ఆర్బీకేలు ఎవరు పెట్టమని అడిగారు?. ఎన్టీఆర్ టైంలో సింగిల్ విండో విధానం తీసుకొచ్చారు. మరి ఆర్బీకేలు ఏం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, భారతదేశానికి అన్నంపెట్టిన ప్రాంతం. విజయనగరం జిల్లాలో పైనే నీళ్లు ఉంటాయి. అందుకు నేను అధికారంలోకి రాగానే వాగులకు వంకలకు చెక్ డ్యామ్ కట్టి నీళ్లు అందిస్తాం. వలసలను అడ్డుకుంటాం. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులకు పూర్తిచేసింది టీడీపీ ప్రభుత్వమే. " - చంద్రబాబు
ఆడా ఉంటా ఇడా ఉంటా
శుక్రవారం కమలాపురంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ తరహాలో తాను ఒక రాష్ట్రం ముఖ్యమని, అధికారమే ముఖ్యమని చెప్పనన్నారు. తాను బొబ్బిలిలో పర్యటించడం తొలిసారికాదన్నారు. తాను సినిమా నటుడుని కాదని చంద్రబాబు అన్నారు. కానీ తన సభలకు భారీ స్థాయిలో జనం ఎందుకు వస్తున్నారన్నారు. శివుడు భస్మాసురుడుని నమ్మినట్లు ఏపీ ప్రజలు ఒక్క ఛాన్స్ అన్న జగన్‌ను నమ్మారన్నారు. ఇప్పుడు ప్రజల నెత్తి మీద చెయ్యి పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని చంద్రబాబు అన్నారు. బొబ్బిలి సభ చూస్తే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోందన్నారు. సీఎ జగన్ తాను ఎక్కడ ఉంటానని అడుగుతున్నారని, తాను ప్రజల హృదయాల్లో ఉంటానని చంద్రబాబు అన్నారు. తెలుగువారు అమెరికాలో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, తెలంగాణలో ఉన్నా వాళ్లతోనే ఉంటానని చెప్పారు. ఎక్కడ తెలుగు వాళ్లు ఉంటే అక్కడ తాను ఉంటానన్నారు. ఇదే జగన్‌కు తన సమాధానం అని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆడా ఉంటా ఇడా ఉంటానని సినిమా రేంజ్‌లో చంద్రబాబు డైలాగ్ చెప్పారు.