Google New Feature:


అర్థం కాని రాతలకు చెక్..


"ఏంటో ఈ డాక్టర్లు రాసేది ఒక్క ముక్క అర్థం కాదు". ఈ మాట మనం తరచుగా వింటూనే ఉంటాం. వైద్యులు ఇచ్చే మందుల చీటీ అలా ఉంటుంది మరి. ఒక్కోసారి మెడికల్ షాప్‌ వాళ్లకూ అర్థం కాక జుట్టు పీక్కుంటారు. కానీ...గూగుల్ తల్లి మాత్రం "ఎందుకంత కంగారు. నేనున్నాగా" అంటోంది. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో డాక్టర్ల చేతిరాతను సింపుల్‌గా డీకోడ్ చేసుకునే వీలుంటుంది. జస్ట్ డీకోడ్ చేయడమే కాదు. ట్రాన్స్‌లేట్ కూడా చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్ టెక్నాలజీలతో ఈ స్పెషల్ ఫీచర్‌ను రూపొందించింది. చదవడానికి కష్టతరంగా ఉండే టెక్స్ట్‌ని చాలా సులువుగా డీకోడ్ చేయడం...ఈ ఫీచర్ ప్రత్యేకత. కేవలం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు అనే కాదు. అర్థం కాదని చేతిరాతలన్నింటినీ అర్థమయ్యేలా చేస్తుంది. గూగుల్‌ లెన్స్ సాయంతో ఇది వీలవుతుంది. ఉదాహరణకు...డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ ఉందనుకుందాం. మనం గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ఆ చీటీని ఓ ఫోటో తీయాలి. వెంటనే గూగుల్‌ అందులోని టెక్స్ట్‌ని 
స్కాన్ చేస్తుంది. గూగుల్‌ లెన్స్ అందులో ఉన్న టెక్స్ట్‌ని డీకోడ్ చేసి హైలైట్ చేసి చూపిస్తాయి. కేవలం మనం చూడడమే కాదు. డీకోడ్ చేసిన ఆ టెక్స్ట్‌ని వేరే వాళ్లతో పంచుకునేందుకూ అవకాశం కల్పించనుంది గూగుల్. ట్రాన్స్‌లేట్ ఫీచర్‌లో భాగంగానే...ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఏ భాషలో ఉన్నా సరే ఆ సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలోకి తర్జుమా చేసి చూపిస్తుంది. అంటే...మీ మొబైల్ కెమెరానే ట్రాన్స్‌లేటర్‌గా పని చేస్తుందన్నమాట. అయితే...ఎప్పుడు ఇది అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని గూగుల్ వెల్లడించలేదు. గూగుల్‌ లెన్స్ ఫీచర్‌ AI టెక్నాలజీతో పని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్‌ను ఎక్కువగా వినియోగిస్తోంది భారత్‌లోనే. 


సెర్చ్ రిపోర్ట్-2022


గూగుల్ ఇటీవల తన వార్షిక ఇయర్ ఇన్ సెర్చ్ రిపోర్ట్ 2022ని విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్‌లకు సంబంధించిన కొన్ని ప్రముఖ సెర్చ్‌ల వివరాలు షేర్ చేశారు. ఒక బ్లాగ్ పోస్ట్ ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ గేమ్ 'Wordle' గ్లోబల్ లిస్ట్‌లో (ప్రపంచవ్యాప్తంగా) టాప్ ట్రెండింగ్ సెర్చ్‌గా నిలిచింది. దీని తరువాత, ఈ సంవత్సరంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన 
సెర్చ్ వర్డ్ 'India Vs England'. ఈ జాబితాలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాలలో 'Ukraine' మూడవది. 'Queen Elizabeth', 'India vs South Africa' నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.  దీంతో పాటు 2022లో ట్రెండింగ్‌లో ఉన్న వ్యక్తులు, సినిమాలు, ఇతర విషయాల జాబితాను కూడా గూగుల్ విడుదల చేసింది. గూగుల్ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం "థోర్: లవ్ అండ్ థండర్," "బ్లాక్ ఆడమ్," "టాప్ గన్: మావెరిక్," "ది బాట్‌మాన్,", "ఎన్కాంటో"  సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి.


Also Read: Isha Ambani: మనవడు మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్, అంబానీతో అట్లుంటది మరి - ఇది టీజర్ మాత్రమే