Lockdown in India:


నిపుణులు ఏమంటున్నారు..


భారత్‌లోనూ కరోనా కేసులు బయట పడుతున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ ఆందోళన మొదలైంది. అయితే...కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై...నిపుణులు వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అలాంటి స్థితి ఇప్పుడు లేదని, ఎవరూ భయపడొద్దని సూచించారు. అలా అని ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వివిధ దేశాల్లో కేసులు పెరుగుతున్నందున అక్కడిపరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఇక్కడా నిఘా పెంచాలని చెబుతున్నారు. సెకండ్‌ వేవ్‌లో లాగా...పెద్ద మొత్తంలో కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరే అవకాశాలు తక్కువే అని అన్నారు. ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మాటల్లో చెప్పాలంటే.."మొత్తంగా చూస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అవసరం లేదు" అని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే...వీలైనంత మేర వ్యాప్తిని అడ్డుకోవడమే ఉత్తమమన్న పాఠం నేర్చుకున్నామని గుర్తు చేశారు. "చైనాలో విస్తరిస్తున్న BF.7వేరియంట్ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది" అని చెప్పారు. అయితే...వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తే పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే భారతీయుల్లోహైబ్రిడ్‌ ఇమ్యూనిటీ పెరిగిందని, అందుకే లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 


విదేశీ ప్రయాణికులపై నిఘా..


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవియా ఈ మేరకు అధికారిక ఓ ప్రకటన చేశారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. అన్ని విమానాశ్రయాల్లోనూ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలున్నా...పాజిటివ్‌ అని తేలినా వెంటనే క్వారంటైన్‌ చేయాలని స్పష్టం చేశారు. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్లు తప్పనిసరిగా Air Suvidh ఫామ్‌లలో ప్రస్తుత ఆరోగ్య స్థితికి సంబంధించిన అన్ని వివరాలు తెలియ జేయాలని కేంద్రం వెల్లడించింది. ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత, సరఫరాపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. గతంలో వచ్చిన కరోనా వేవ్ లో ఆక్సిజన్ లభ్యత లేక, సరఫరా కొరత కారణంగా ఆసుపత్రుల్లో ఎంతో మంది కరోనా బాధితులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. చైనాలోని ఒక నగరంలో ప్రతిరోజు దాదాపు ఐదులక్షల మందికి కరోనా వ్యాపిస్తోందని, అక్కడి ప్రభుత్వం ప్రకటిస్తున్న నివేదికలలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఒక ఉన్నత ఆరోగ్య అధికారి తెలిపినట్లు ఏఎఫ్‌పీ వార్త సంస్థ పేర్కొంది.


Also Read: Isha Ambani: మనవడు మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్, అంబానీతో అట్లుంటది మరి - ఇది టీజర్ మాత్రమే