కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవని, కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యామిలీ లాంటిదని ఎలాంటి సంక్షోభం లేదన్నారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు తమ స్వార్థం కోసం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ లో శనివారం సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వాలు విత్తనాలు ఎరువులపై సబ్సిడీలు ఎత్తివేశాయన్నారు. రైతుల పట్ల రెండు పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. యూనివర్సిటీ ల నిర్వహణ చాలా అధ్వానంగా మారిందని, కేవలం ఓట్ల కోసం కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలపై మీడియా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించగా.. టీపీసీసీలో, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలు లేవన్నారు. తమ పార్టీ నేతలంతా ఒక ఫ్యామిలీగా కలిసుంటామని, ఎలాంటి సంక్షోభం లేదన్నారు. పార్టీలో గ్రూపులు సమసిపోయాయి. అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల కోసం పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. క్రమ శిక్షణ ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు. 
జనవరిలో రేవంత్ పాదయాత్ర ప్రారంభం..
పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా పనిచేస్తే ఎంతటి వారైనా కూడా చర్యలు తప్పవన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందేనని మాజీ మంత్రి స్పష్టం చేశారు. జనవరి నెలలో హాత్ మే హాత్ పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిల్లాల్లో పాదయాత్ర చేపట్టబోతున్నారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.


నేతలతో దిగ్విజయ్ వరుస భేటీలు.. సమస్యలు కొలిక్కి వచ్చినట్టేనా?
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ హస్తం పార్టీలోని ట్రుబల్‌ షూటర్ గా తెలంగాణకు వచ్చారు. టీపీసీసీ తాజా కమిటీల పార్టీలో వర్గ విభేదాలను బయటపెట్టాయి. సీనియర్లు, అసంతృప్తులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయడానికి దిగ్విజయ్ వచ్చి వెళ్లారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో సమస్యలు మరింత జఠిలంగా మారాయి. రోజురోజుకి రేవంత్‌ పై వ్యతిరేకత పెరుగుతున్నా అధిష్టానం చూసీ చూడనట్లు వ్యవహరించింది. చివరకు పరిస్థితి చేయిదాటిపోయే సీనియర్లంతా ఒక్కటై తిరుగుబాటు జెండా ఎగరేసే వరకు వచ్చింది. కాంగ్రెస్‌ పెద్దలకు సమస్య ఎంత క్లిష్టమైనదో తెలుసుకునేసరికి ఆలస్యమైపోయింది. రంగంలోకి దిగిన ట్రబుల్‌ షూటర్‌ దిగ్విజయ్‌ సింగ్‌ రాష్ట్ర పార్టీ నేతలతో భేటీ అయ్యి వారి సమస్యలు తెలుసుకున్నారు. 


రేవంత్ వర్సెస్ ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉన్న నేతల వర్గం వాదనలు విన్నారు. రెండు వర్గాల నేతలు ఎవరికి తోచినట్లు వాళ్లు తమ బాధలు, సమస్యలు చెప్పగా.. అవన్నీ విని షాకవ్వడం దిగ్విజయ్ వంతు అయ్యింది.  ఎంత సర్దిచెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో లేకపోవడంతో ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు తిరిగి వెళ్లిపోయారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ పాదయాత్రకి అపూర్వ స్పందన లభిస్తోందని, కాంగ్రెస్ కు మళ్లీ పాత రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.