హైదరాబాద్‌లో నేడు జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముసాయిదా పద్దుపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో నగర కార్పోరేటర్లు అందరూ పాల్గొంటారు. జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో కార్పోరేటర్లకు, జీహెచ్ఎంసీ మేయర్‌కు మద్య కొన్ని విషయాన్ని పొరపాచ్చాలు వస్తున్నాయి. తాజాగా ఉప్పల్ జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకపోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సొంత కార్పోరేటర్ల మధ్యే విబేధాలు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనేక పెండింగ్ పనులను అధికారులు సకాలంలో పూర్తి చేయడంలేదని విపక్ష కార్పోరేటర్లు ఆరోపిస్తున్నారు. మరి చూడాలి ఈ రోజు జరిగే జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశం ఎలా జరుగుతుందో. 


నేడు రాచకొండ కమిషనరేట్ వార్షిక నివేదిక. 
రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఈ రోజు రాచకొండ పరిధిలోని నేరాలు, పోలీసుల పనితీరుపై 2022 వార్షిన నివేదిక వెల్లడించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు వార్షిన నివేదిక అందజేశాయి. 


రోడ్లపైకి కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు.. నేడు ప్రారంభం


ప్ర‌యాణికుల‌కు వేగంగా, సౌక‌ర్య‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు టీఎస్ ఆర్టీసీ నిరంత‌రం కృషి చేస్తోంది. ఈ క్ర‌మంలో నేడు ట్యాంక్‌బండ్ వేదిక‌గా కొత్త‌గా 50 సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల‌ను రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఎండీ వీసీ స‌జ్జ‌నార్ క‌లిసి ప్రారంభించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప‌చ్చ‌జెండా ఊపి కొత్త బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.


ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఅర్‌ సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ నేతృత్వంలో యాజమాన్యం నూతన బస్సులను కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డీలక్స్‌, 16 స్లీపర్‌ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 50 బ‌స్సులు అందుబాటులోకి రాగా, వాటిని నేడు ప్రారంభించ‌నున్నారు.


నేడు భారత్ జోడో యాత్రలో పాల్గోనున్న తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. 


తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డితోపాటు మిగిలిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. హర్యానాలో కొనసాగుతున్న యాత్రకు సంఘీభావంతో ఎంపీలు పాల్గొంటున్నారు. కరోనా కారణాలతో యాత్రను అడ్డుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 


బీడీబీఎస్‌బిలో మిగిలిన సీట్లకు నోటిఫికేషన్‌


ప్రైవేటు దంత కళాశాలల్లో యాజమాన్య కోటాలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్స్‌ (బీడీఎస్‌) ప్రవేశాలకు  కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం  విడుదల చేసింది. మాప్‌ అప్‌ విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నేడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.