గంజాయి సాగు, రవాణా, నియంత్రణ, లభ్యతను కట్టడి చేస్తూనే పాఠశాలలు, కళాశాలలకు సరఫరా చేస్తున్న నెట్ వర్క్‌పైన ప్రత్యేక దృష్టి సారించటమే ప్రధాన లక్ష్యమన్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. గంజాయిపై చైతన్యం కోసం హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని కాలేజీలు, స్కూల్స్‌లో సెబ్‌తో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్లతో ప్రచారం చేయబోతున్నామని వివరించారు.
విశాఖపట్నం రూరల్ ఏజెన్సీ ప్రాంతంలోని కోన్ని మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ మొదటి విడతలో ప్రత్యేక కార్యక్రమాన్ని 30.10.2021న ప్రారంభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంతంలోని 7500 ఎకరాల్లో గంజాయి సాగు పంట ధ్వంసం చేసినట్టు వివరించారు. 2022లో పోలీసులు చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా గంజాయి సాగుకు అత్యంత అనువైన జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, పెద్దబయలు, ముచంగ్గిపుట్ట, దంబ్రిగుడ, పాడేరు మండలాల్లో గంజాయి సాగు గణనీయంగా నిర్మూలించామన్నారు.
గంజాయి పండిస్తున్న ప్రాంతాలపైన సర్వే ..
ఈ సంవత్సరం చేపట్టిన మొదటి, రెండో విడత ప్రత్యేక కార్యక్రమల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు గంజాయి సాగు, రవాణా పట్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ అవగాహన కల్పించడంతో పాటు గంజాయి సాగు, రవాణా కు పాల్పడుతున్న వారిపైన కేసులు నమోదు చేశామన్నారు. పాత నేరస్తులను గుర్తించి వారిపైన పీడీ యాక్ట్ ప్రయోగించామని వెల్లడించారు. గంజాయేతర పంటలకు విత్తనాలను రైతులకు ఉచితంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఇచ్చామని అల్లం, పసుపు వంటి పంటలను వేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం..
నవంబర్-2022 మొదటి విడత 480 ఎకరాలు, డిసెంబర్-2022 రెండో విడతలో 120 ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించినట్టు డీజీపీ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంజాయి సాగు చేస్తున్న ఆయ ప్రాంతలను ఉపగ్రహ చాయా చిత్రాలు ద్వారా గుర్తించామని పేర్కొన్నారు. వాటిని నిర్మూలించేందుకు స్థానిక పోలీసులతోపాటు గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, ఎస్‌ఐబి సిబ్బందితో నవంబర్, డిసెంబర్‌లో ఐదు రోజుల పాటు క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 600 ఎకరాల్లోని గంజాయి సాగు నిర్మూలించామన్నారు.
నిరంతర తనిఖీలు ...
ఏజెన్సీలోని ప్రాంతాల నుంచి గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు నిరంతరం వాహనాల తనిఖీలు, ఏజెన్సీలోకి వచ్చే కొత్త వ్యక్తుల కదలికలపైన నిఘా పెట్టామన్నారు. గంజాయి ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా నుంచి రవాణా అవుతున్నట్టుగా గుర్తించామన్నారు. దీనిని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒడిశా రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖలు అధికారుల సంపూర్ణ సహకారంతో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయ పంటలుగా సిల్వర్ ట్రీ, పెప్పర్, కాఫీ, పసుపు, మామిడి, కొబ్బరి మొక్కలు, జీడి మామిడి, రాగి, రాజ్మ, కంది పంట, అల్లం, వరిపంట, రబ్బర్ మొక్కలు, నిమ్మ, జాఫ్రా, పత్తి, నువ్వులు, పచ్చిమిర్చి,రాగులు, పల్లి, కూరగాయల విత్తనాలు ఉచితంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ వివిధ కేసుల్లో మొత్తం 2,45,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుందని, ఇందులో 70 శాతం ఒడిశా నుంచి వస్తున్నట్లు తేలిందని తెలిపారు.
విశాఖపట్నం, ఏలూరు,గుంటూరు, కర్నూలు, అనంతపురం రేంజ్ పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయిని దహనం చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. 23న ఏలూరు రేంజ్ పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పచ్చిమ గోదావరి, క్రిష్ణ జిల్లాలో 465 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 64,832 కిలోల గంజాయిని కాల్చివేశారు.
24న విశాఖపట్నం రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం,అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం,అనకాపల్లి జిల్లాలలో స్వాధీనం చేసుకున్న 1,80,000 కిలోలకు పైగా గంజాయిని అనకాపల్లి జిల్లా, కోడూరు గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో కాల్చివేయనున్నారు.
24న గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో స్వాధీనం చేసుకున్న 10,000 కిలోలకు పైగా గంజాయిని కాల్చివేయనున్నారు.
25న విశాఖపట్నం సిటి, విజయవాడ సిటి లో 25000 కిలోల గంజాయిని కాల్చివేయడం జరుగుతుంది.
26న కర్నూలు, అనంతపురం రేంజ్ పరిధిలో 16000 కిలోల గంజాయిని కాల్చివేయడం జరుగుతుంది.