Jayalalithaa Death Case: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మృతిపై దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. జయలలిత మరణానికి దారి తీసిన పరిస్థితులపై జస్టిస్ ఏ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక ఇచ్చింది.
శశికళపై
జయలలిత మృతి సమయంలో ఆమె సన్నిహితురాలు వీకే శశికళ వ్యవహారశైలిని తప్పుబడుతూ, ఆమెతో పాటు ఓ ప్రభుత్వ అధికారి, ఆసుపత్రి వైద్యులపై దర్యాప్తు జరపాలని కమిషన్ సిఫారసు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ నివేదికను ప్రభుత్వం శాసన సభలో మంగళవారం ప్రవేశపెట్టింది.
ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఉన్నపుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ రామమోహన్ రావు క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు ఈ నివేదిక పేర్కొంది. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్‌పై కూడా ఆరోపణలు చేసింది. జయలలిత పరిస్థితిపై అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తప్పుడు ప్రకటనలు చేశారని పేర్కొంది.
చనిపోయిన సమయం
2016, డిసెంబరు 5న జయలలిత మరణించినట్లు అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆమె డిసెంబర్ 4న మరణించారని ఈ కమిషన్ విచారణలో పలువురు ద్వారా తెలిసినట్లు నివేదిక వెల్లడించింది.
డీఎంకే హామీ
ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే.. జయలలిత మరణానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిస్తామని 2021 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది.
ఆర్ముగస్వామి కమిషన్ సమక్షంలో సాక్ష్యం చెప్పినవారిలో ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వం, శశికళ, జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, అపోలో ఆసుపత్రి వైద్యులు ఉన్నారు. జయలలిత అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లు స్టేట్‌మెంట్లు ఇచ్చారు.
Also Read: Uttarakhand Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్- ఏడుగురు మృతి!