J&K Target Killings: జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మైనార్టీలు, వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు వలస కూలీలను ఉగ్రవాదులు చంపారు.
దారుణం
షోపియాన్ జిల్లా హర్మెన్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఇద్దరు కూలీలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు యూపీలోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్, మోనిశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
ఉగ్రదాడితో హర్మెన్ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. లష్కరే తోయిబాకు చెందిన హైబ్రీడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణంలో కూలీలపైకి గ్రెనేడ్ విసిరింది ఇమ్రానే అని తేలింది.
అయితే గత నాలుగు రోజుల్లో ఇప్పటికే రెండుసార్లు దాడులు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ కశ్మీరీ పండిట్‌ను టెర్రరిస్టులు ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు.
బదులిస్తాం
మరోవైపు ఈ ఘటనకు కచ్చితంగా బదులిస్తామని కశ్మీర్ జోన్ ఏడీజీపీ అన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
టార్గెట్ కిల్లింగ్స్
కశ్మీర్‌లో పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. ఇటీవల షోపియాన్ జిల్లాలో ఓ వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. చౌదరీ గండ్ ప్రాంతంలోని పురన్ కృష్ణన్ భట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇంటి గార్డెన్ వద్దే అతడిని ముష్కరులు కాల్పులు జరిపారు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే సంస్థ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుందని డీఐజీ సుజిత్ కుమార్ తెలిపారు. ఎందుకు హత్య చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఉగ్రవాదుల చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని మనోజ్ సిన్హా అభివర్ణించారు. బాధిత కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదన్నారు.
Also Read: Uttarakhand Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్- ఏడుగురు మృతి!