ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిని జనసేన పార్టీ ఫోటోలు, వీడియోల సహితంగా ప్రజల ముందు ఉంచుతోంది. మూడు రోజుల పాటు జనసేన పార్టీ కార్యకర్తలు ఊరూ వాడ తమ తమ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలోకి అప్ లోడ్ చేశారు. దాదాపుగా 175 నియోజకవర్గాల్లోనూ రోడ్లు అధ్వాన్న స్థితికి చేరాయని సోషల్ మీడియా పోస్టులు, ట్వీట్ల ద్వారా అర్థమవుతోందని జనసేన నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు పూర్తిగా నాశనం అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం దన్న కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు  జేఎస్పీ ఫర్ రోడ్స్ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. సెప్టెంబర్ 2 , 3, 4 తేదీల్లో జనసైనికులంరూ ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని పిలుపునిచ్చారు.



పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా గజానికో గుంత.. అడుగుకో గొయ్యి ఉందని మిలియన్ల కొద్దీ వచ్చిన ట్వీట్లతో స్పష్టమైందని జనసేన పార్టీ నేతలు అంటున్నారు. # JSP For AP Roads  హ్యాష్ ట్యాగ్‌తో పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలతో రెండున్నర లక్షలకుపైగా ట్వీట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. నేషనల్ ట్రెండింగ్‌లో టాప్ ఫైవ్‌లో ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకూ అన్ని ప్రాంతాల ప్రజలు తమ ఊళ్లలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన రోడ్లను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో సామాజిక మాధ్యమాల్లో ప్రజలు చూపుతున్న వీడియోలు, ఫోటోల ద్వారా వెల్లడవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు. 



సోషల్ మీడియాలో  ఫోటోలు, వీడియోలు, సమాచారం పంపించడం సాధ్యం కానివారి కోసం 7661927117 అనే నెంబర్ ఇచ్చి వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాట్లను జనసేన చేసింది. రోడ్ల కోసం జనసేన చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం డిజిటల్ ఉద్యమంగానే ఉంది. ప్రభుత్వం ఈ దుస్థితిపై స్పందించకపోతే త్వరలో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతారు. జనసేన సొంతంగా శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం పవన్ కల్యాణ్ కూడా రెండు రోజుల పాటు శ్రమదానం చేస్తానని గతంలోనే ప్రకటించారు. గాంధీ జయంతి రోజుకల్లా రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వానికి జనసేన డెడ్ లైన్ పెట్టింది. ఆ లోపు చేయకపోతే శ్రమదానం చేస్తామని ప్రకటించింది.


Also Read : ప్రకాష్ రాజ్ ప్యానల్ అధికార ప్రతినిధిగా గణేష్ ఫస్ట్ డైలాగ్స్



ఏపీలో రెండున్నరేళ్లుగా రోడ్ల నిర్వహణ నిలిపివేశారు. వరుసగా వర్షాలు, తుపాన్ల కారణంగా రోడ్లన్నీ పాడైపోయాయి. కనీస మరమ్మత్తులు కూడా చేయకపోవడంతో ప్రయాణాలు భారంగా మారాయి. చిన్న గుంతలు కాస్తా పెద్ద గొయ్యిలుగా మారిపోవడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. పనులు చేయించడానికి ప్రభుత్వం టెండర్లు పిలుస్తున్నా కాంట్రాక్టర్లు ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. 


Also Read : సీజేఐ ఎన్వీ రమణ భావోద్వేగం