బార్ కౌన్సిల్‌తో ఎనలేని అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తమ మూలాలు బార్ కౌన్సిల్ నుంచే మొదలయ్యాయన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వీ రమణను శనివారం సత్కరించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక ప్రసంగం చేశారు. న్యాయ వ్యవస్థలో సవాళ్లను అధిగమించేందుకు తన వంతు కృషిచేస్తానని స్పష్టం చేశారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా సౌకర్యాల లేమిపై సమాచార సేకరణలో ఉన్నామని జస్టిస్ రమణ తెలిపారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందుతుందని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. సుప్రీం కోర్టులో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామన్న జస్టిస్ ఎన్వీ రమణ వేర్వేరు హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి పేర్లు సిఫార్సు చేశామని పేర్కొన్నారు. ఖాళీల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటుందని, న్యాయశాఖ మంత్రి చొరవ తీసుకుంటారని భావిస్తున్నామన్నారు.
ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి
సీజేఐగా బాధ్యతలు చేపట్టినందుకు జస్టిస్ రమణను అభినందిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవాళ ఘనంగా సత్కరించింది. దిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. న్యాయవిద్యలో నాణ్యత కోసం తపన, న్యాయవాద వృత్తిపై నిబద్ధత జస్టిస్ రమణ సీజేఐ కాకముందే ఆయన ప్రసంగాల్లో ప్రతిబింబిస్తూనే ఉందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. జస్టిస్ రమణ ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారని ఆయనను కలిసిన తర్వాత అర్థమైనట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. దేశంలోని దిగువ కోర్టుల్లో సామాన్యులకు న్యాయం జరగడంలో జాప్యం జరుగుతోందని తెలిపిన కేంద్ర మంత్రి సత్వర న్యాయం జరిగేలా సీజేఐ దృష్టి పెట్టాలని కోరారు.
‘‘మా మూలాలు బార్ కౌన్సిల్ నుంచే మొదలయ్యాయి. ఖర్చులు, విచారణలో జాప్యం న్యాయవ్యవస్థకు అతిపెద్ద సవాల్. ఆ సవాల్‌ను అధిగమించేందుకు నా వంతు కృషి చేస్తాను. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రజలు న్యాయవాదులపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రతి న్యాయవాదిపై ఉంది. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించాలి’’ అని జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు.