ఎఫ్‌ఏటీ పరిధిలోని స్కూల్స్‌పై నిషేధం
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ-పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫలాహ్ ఎ ఆమ్ ట్రస్ట్-FAT పరిధిలో నడిచే అన్ని స్కూల్స్‌ని బ్యాన్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జమాత్ ఏ ఇస్లామీకి సంస్థకు అనుబంధంగా ఉంది ఎఫ్‌ఏటీ. అందుకే ఆ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలపైనా నిషేధం విధించింది. జమ్ము, కశ్మీర్ ప్రజల భవిష్యత్‌ని నాశనం చేసేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు మెహబూబా ముఫ్తీ. ఈ నిర్ణయమూ ప్రజల్లో వేధించటంలో భాగమేనని అసహనం వ్యక్తం చేశారు. మొదట స్థానికంగా ఉన్న వనరులు, ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకున్న కేంద్రం..ఇప్పుడు విద్యా వ్యవస్థనూ నాశనం చేయాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. కశ్మీరీ ప్రజలు ఈ సవాలుని అధిగమిస్తారని, తమ పిల్లల భవిష్యత్‌ను కాపాడుకుంటారని ట్వీట్ చేశారు మెహబూబా ముఫ్తీ.
15రోజుల్లో మూసివేయాల్సిందే..
జమ్ము, కశ్మీర్‌లోని విద్యావిభాగం ఎఫ్‌ఏటీ పరిధిలో నడుస్తున్న 300 పాఠశాలల కార్యకలాపాలను నిలిపివేసింది. జూన్ 13 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా సెక్రటరీ బీకే సింగ్ ఆదేశాలు జారీ చేశారు. పలు జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులు 15 రోజుల్లో ఎఫ్ఏటీ పరిధిలోని స్కూల్స్‌ని మూసివేయాలని ఆర్డర్లు వేశారు. ప్రస్తుతానికి ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని సూచించింది విద్యాశాఖ. ఈ స్కూల్స్...అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తున్నాయని అంటోంది కేంద్రం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
జమాత్ ఏ ఇస్లామీ సంస్థపై నిషేధం
జమాత్ ఏ ఇస్లామీ సంస్థకి సంబంధించిన ఆస్తుల్ని 2019లోనే సీల్ చేసింది. ఈ సంస్థను నిర్వహించే నాయకుల ఇళ్లనూ సీల్ చేశారు అధికార వర్గాలు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలతో పాటు వేర్పాటువాద ఉద్యమానికి మద్దతునిస్తోందన్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం జేఈఐపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయంపైనా అప్పట్లో మెహబూబా ముఫ్తీ తీవ్రంగానే విమర్శలు చేశారు. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇలాంటి ప్రతీకార చర్యలు మానుకోవాలంటూ మండిపడ్డారు. అయితే కేంద్రం మాత్రం జమ్ము, కశ్మీర్‌లో శాంతి భద్రతల్ని కాపాడేందుకే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని వివరణ ఇస్తోంది. ప్రస్తుతానికి జమ్ము, కశ్మీర్ విషయంలో చాలా మొండిగా దూసుకుపోతోంది కేంద్రం. ప్రతిపక్షాలు, అక్కడి నేతలు ఏమన్నా పట్టించుకోవటం లేదు. ప్రత్యేక హోదా రద్దు చేసిన తరవాతే ఈ ప్రాంతం అభివృద్ధి సాధించిందని చెబుతోంది. ఇకపైనా మరింత కఠినంగా వ్యవహరించక తప్పదని చెబుతోంది.
Also Read: Agnipath Scheme: అగ్నివీరులపై ఎలాంటి వివక్ష ఉండదు, ఆందోళనలు వద్దు-అనిల్ పూరీ ఇంకేమన్నారంటే
Also Read: Virata Parvam: 'విరాటపర్వం' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?