Jammu Kashmir Accident:


కాలువలో పడిన వాహనం..


జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందారు. వీరిలో ఓ ఆఫీసర్ కూడా ఉన్నారు. కుప్వారాలో ఓ కాలువలో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్యాట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ట్రాక్‌పై మంచు భారీగా కురిసిందని ఈ కారణంగా వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోయిందని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. ముగ్గురి మృతదేహాలను బయటకు తీసింది. గతేడాది నవంబర్‌లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. మచ్చల్ సెక్టార్‌లో తీవ్రంగా మంచు కురుస్తున్న కారణంగా  భారత సైనికులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అడుగులోతు మేర మంచు కూరుకుపోయింది. గతంలో గ్లేషియర్‌ విరిగిపడడం వల్ల ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా మచ్చల్ సెక్టార్‌లోనే జరిగింది. ప్యాట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి మంచు గడ్డలు వచ్చి మీద పడడం వల్ల ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. 










సిక్కింల్‌లో ఘోర ప్రమాదం..


గతేడాది డిసెంబర్‌లో ఉత్తర సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురై 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. భారత సైన్యం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. మలుపు తిరిగే సమయంలో ఉన్నట్టుండి స్కిడ్‌ అయి పడిపోయిందని లోయలోకి పడిపోయిందని  అధికారులు తెలిపారు. "దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ముగ్గురు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లతో పాటు 13 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ కఠిన సమయంలో ఆ సైనికుల కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ అండగా ఉంటుంది. నార్త్ సిక్కిం చాలా ప్రమాదకరమైన ప్రదేశం. చాలా రోజులుగా ఇక్కడ తీవ్రంగా మంచు కురుస్తోంది" అని ఇండియన్ ఆర్మీ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. "రోడ్డు ప్రమాదంలో సైనికులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. వాళ్లు ఇన్నాళ్లు అందించిన సేవలను దేశం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు. 


Also Read: Governor RN Ravi: కేంద్రం, రాష్ట్రం మధ్య విభేదాలు వస్తే మీరు కేంద్రానికే సపోర్ట్ ఇవ్వాలి - సివిల్ ఇంటర్వ్యూల్లో తమిళనాడు గవర్నర్