Governor RN Ravi:


గవర్నర్‌పై నిరసన...


తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ RN రవి మధ్య ఎన్నో రోజులుగా వివాదం కొనసాగుతూనే ఉంది. గతంలో GetoutRavi అనే హ్యాష్‌ట్యాగ్‌ బాగా వైరల్ అయింది. నిన్న అసెంబ్లీ నుంచి గవర్నర్ వెళ్లిపోవడం సంచలనమైంది. ఈ క్రమంలోనే..గవర్నర్ ఆర్‌ఎన్ రవి సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూల కోసం వచ్చిన వాళ్లతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏవైనా విభేదాలు తలెత్తితే... సివిల్ సర్వీసెస్ అధికారులంతా కేంద్రానికి సపోర్ట్ ఇవ్వాలని అన్నారు ఆర్‌ఎన్ రవి. "కేంద్రం, రాష్ట్రం మధ్య ఏదైనా విభేదం వస్తే మీరు తప్పకుండా కేంద్రానికే మద్దతుగా నిలబడాలి. ఇందులో ఎలాంటి అనుమానాలు ఉండకూడదు" అని తేల్చి చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో EWS రిజర్వేషన్ల అమలుపై చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. స్టాలిన్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల అమలుని ససేమిరా అంటున్నారు. సామాజిక న్యాయం కోణంలో ఆలోచిస్తే ఇది విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వంతో విభేదించిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై డీఎమ్‌కే మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎమ్‌కేకి మద్దతునిచ్చే విద్యార్థి సంఘాలు కూడా నిరసనలు దిగుతున్నాయి. గవర్నర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నాయి. తమిళనాడు రాజ్‌భవన్‌పై ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు కూడా అంటించారు. ఈ పరిస్థితులను గమనించిన బీజేపీ వెంటనే గవర్నర్‌ను డిఫెండ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం కార్యకర్తలు సంయమనంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనవసరపు విషయాల కోసం సమయాన్ని, శక్తిని వృథా చేసుకోవద్దంటూ సూచించారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెట్టిన పోస్టర్‌లు తొలగించి..వాటికి బదులుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయాలని తెలిపారు. 


సీఎం ఆగ్రహం..


"గవర్నర్ తన ప్రసంగంలో అంబేడ్కర్, పెరియార్, అన్నా పేర్లను మర్చిపోవడాన్ని ఖండిస్తున్నాం. అసెంబ్లీని అగౌరవపరిచారు. జాతీయ గీతాన్ని కూడా అవమానించారు. జాతీయ గీతాన్ని వినిపించే ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు" అని విమర్శిస్తోంది తంతై పెరియార్ ద్రవిడర్ కరగం (TDPK) పార్టీ. పలు కాలేజీల విద్యార్థులూ గవర్నర్‌కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా వారి అభివృద్ధికి 210 కోట్ల రూపాయల లోన్లు అందజేసినట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. గవర్నర్ తీర్పును సీఎం స్టాలిన్ తప్పుపట్టారు. గతంలో ఎక్కడా లేని సరికొత్త సంప్రదాయానికి గవర్నర్‌ శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీతోపాటు మిగతా పక్షాలు కూడా గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశాయి. ఈ వివాదం ఆన్‌లైన్‌లో కూడా పెను దుమారాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రం నుంచి గవర్నర్‌ రవి వెళ్లిపోవాలంటూ డీఎంకే సానుభూతిపరులు ట్రోల్ చేస్తున్నారు. గెట్‌ అవుట్‌ రవి అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. యూనివర్శిటీల వివాదం వచ్చినప్పుడు కూడా ఈ హ్యాష్ ట్యాగ్‌ బాగా ట్రెండ్ అయింది. 


Also Read: మాస్టర్‌ ‘ప్లాన్‌’ ముంచేస్తుందా ? బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ముదురుతున్న వార్‌!