బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ రివర్స్‌ అవుతోంది. ఇండస్ట్రియల్‌ జోన్‌ కింద వస్తోన్న ఈ మాస్టర్‌ ప్లాన్‌ వల్ల భూములు పోతాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డితో మొదలైన ఈ ఆందోళన ఇప్పుడు అన్ని జిల్లాలకు విస్తరిస్తోంది. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ కూడా ఆందోళనకు కేరాఫ్‌ గా మారింది. కామారెడ్డి తరహాలోనే ఇక్కడి రైతన్నలు కూడా నిరసనకు దిగారు. కలెక్టరేట్‌ ముట్టడికి పిలునివ్వడం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. 


గత కొన్ని నెలలుగా కామారెడ్డి రైతన్నలు మాస్టర్‌ ప్లాన్‌ ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. అన్నదాత ఆత్మహత్యతో ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాకలెక్టరేట్‌ ముట్టడికి రైతన్నలు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కలెక్టర్‌ వచ్చి చర్చలు జరిపే వరకు వెళ్లబోమని కామారెడ్డి అన్నదాతలు రోడ్డుపైనే బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. 


ఈ క్రమంలో బీజేపీ రంగంలోకి దిగింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కలెక్టర్‌ తీరుని తప్పుబడుతూ కామారెడ్డి రైతులతో కలిసి ఆపార్టీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ మద్దతు తెలిపారు. దీంతో రైతన్నల మాస్టర్‌ ప్లాన్‌ ఆందోళన విపక్షాలకు ఆయుధంగా మారడంతో ప్రభుత్వం ఈ విషయంపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు మొదలయ్యాయి. మంత్రి కెటిఆర్‌ కామారెడ్డి రైతుల ఆందోళనపై స్పందించిన తీరు చూసిన వారు ఈ విమర్శలు నిజమన్న వాదన తీసుకువచ్చారు. ప్రస్తుతం మాస్టర్‌ ప్లాన్‌ ఇష్యూ హైకోర్టు పరధిలో ఉంది. 


నిన్న కామారెడ్డి...నేడు జగిత్యాల.


ఇప్పుడు జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ రగడ కూడా హైకోర్టుకి చేరే అవకాశాలు లేకపోలేదన్న టాక్‌ ఉంది. ఇక్కడ కూడా కాషాయం రాజకీయం చేయబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌తో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లబ్ధి పొందాలనుకుంటే ఆ పార్టీకే ఎసరు తెచ్చేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు రైతు ప్రభుత్వంగా చెప్పుకొన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు పారిశ్రామికవాదులకు అండంగా ఉంటోన్న ఆరోపణలు ఎదుర్కోంటోంది. మా అనుమతి లేకుండా మా భూములను ఎలా తీసుకుంటారని రైతులు నిలదీస్తున్నారు. 


ఈ వాదనను ప్రభుత్వం ఖండిస్తోంది. ఇది ప్రతిపాదన మాత్రమేనని, భూములు లాక్కోమని, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉందని ప్రకటించింది. అయినా సరే రైతన్నలు మాత్రం ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవించడం లేదు. మరోవైపు దీన్నే ఆసారాగా చేసుకొని రాజకీయలబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని అధికారపార్టీ విమర్శిస్తోంది. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆపార్టీ నేతలు అంటున్నారు. 


గతంలో ధాన్యం కోనుగళ్ల విషయంలోనే ఇలానే అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రగడ జరిగింది. కేంద్రమే కోనుగోళ్లు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపణలు చేయడం, చెప్పిన దాని కన్నా ఎక్కువే కొన్నామని బీజేపీ నేతలు చెప్పడంతో రైతన్నల్లో అసహనం పెరిగిపోయింది. ఫలితంగా ధాన్యం బస్తాలను ఆయాపార్టీల నేతల ఇళ్ల ముందు కుప్పలుగా పడేసి మంటపెట్టారు. ఇప్పుడు మరోసారి మాస్టర్‌ ప్లాన్‌ విషయంలోనూ ఇలా అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎవరి రాజకీయాలు వాళ్లు చేస్తుండటంతో ఫలితం ఎలా ఉంటుందోనన్న భయం రైతన్నల్లో నెలకొంది.


ఆ 80 ఎకరాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్న స్థానికులు. 


నూతన మాస్టర్ ప్లాన్‌లో తమ గ్రామాలను పలు జోన్ల కింద కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట తిమ్మాపూర్, నర్సింగాపూర్ గ్రామాల రైతుల ఆందోళకు దిగారు. తమ గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నా పచ్చని పొలాలను ఇండస్ట్రియల్ రిక్రియేషన్ జోన్లుగా కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తo చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అధికారులు స్పందించకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్‌కి సంబంధించిన ఫ్లెక్సీలు చింపేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 


నర్సింగాపూర్ సమీపంలోని 700 ఎకరాల భూమి ఉందని, దీన్ని కాజేసేందుకే స్థానిక మున్సిపల్ ఛైరపర్సన్, ఆమె భర్త, వారి మామ కలసి కుట్రపన్నుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2012 లో 318 ఎకరాల భూమి గవర్నమెంట్‌ది అని ఉండగా తాజా సర్వేలో 220 ఎకరాలు మాత్రమే చూపిస్తున్నారనీ, ఆ 80 ఎకరాలు ఏమయ్యాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం జగిత్యాల మాస్టార్ ప్లాన్ అంశం అటు అధికార, విపక్ష పార్టీల మద్య మరింత వైరాన్ని పెంచడంతోపాటు భూములు, వాటి సర్వేలపైన చర్చ జరుగుతోంది.