స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, మూడు విడతల్లో చేపట్టాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలని, పనుల్లో నాణ్యతతో పాటుగా చిన్నారులకు మంచి వాతావరణం అందించాలని సీఎం అన్నారు. ప్రతి మండలంలో కూడా పనులు జరిగేలా మూడు విడతలుగా కార్యాచరణ రూపొందించాలని జగన్ సూచించారు.
అంగన్‌వాడీల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలని, సమగ్రమైన ఎస్‌ఓపీలు రూపొందించుకోవాలని, టెక్నాలజీ వాడుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే కచ్చితంగా సంబంధిత వ్యక్తులను బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సూపర్‌వైజర్లపైన కూడా పర్యవేక్షణ ఉండాలని జగన్ అన్నారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీచేయాలని ఆదేశాలిచ్చారు. నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలని, పిల్లలకు ప్లేవర్డ్ పాలు పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించారు. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్ మిల్క్ పంపిణీ కావాలన్న సీఎం, ఈ మేరకు షెడ్యూల్ రూపొందించుకోవాలని చెప్పారు. అంగన్‌వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకురావటం, అంగన్వాడీలలో స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి, ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా పరిశీలన చేయించాలన్న ముఖ్యమంత్రి, వైద్యపరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్పష్టం చేశారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
తల్లికానీ, బిడ్డకానీ.. ఎవరైనా రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ ఉండాలన్నారు. ఈ విషయంలో అంగన్‌వాడీలు, విలేజ్ క్లినిక్స్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, అందరితోపాటు ఇచ్చే మందులు కాకుండా.. అదనంగా ఇస్తూ... వీరి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచనలు ఇచ్చారు. అవసరం మేరకు ఎస్‌ఓపీలను తయారు చేయాలన్న సీఎం, ఫిబ్రవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో దీనికి పరిష్కారం చూపించాలని, తల్లులకు టేక్ హోం రేషన్ విధానం పై ఆలోచన చేయాలన్నారు. దీని కోసం లోపాలకు తావులేని విధానాన్ని రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు. అంగన్‌వాడీలలోలను, ప్రభుత్వ బడులలో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు కాబట్టి,ఆయా వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉందని, వారి పట్ల సానుకూల ధృక్పధంతో పనిచేయాలని తెలిపారు. 10–12 ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమైన ఫలితాలు సాధించవచ్చని,విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యకార్యక్రమంగా చేపట్టిందని తెలిపారు.