మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ " మా " ఎన్నికలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. నిజానికి అది చాలా చిన్న అసోసియేషన్. గట్టిగా 900 మంది సభ్యులు మాత్రమే ఉంటారు. అందులో 300 మంది ఓటింగ్‌కు కూడా రారు. రూ. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకునే నటీనటుల సంఘానికి బడ్జెట్ కూడా రూ. కోట్లలో ఉండదు. అందరూ కలిసి చారిటీ ప్రోగ్రాం పెడితే వచ్చే స్పాన్సర్‌షిప్‌లు .. ఇంకా ఎవరైనా బాగా డబ్బు సంపాదించే సెలబ్రిటీలు ఇచ్చే విరాళాలే ఆదాయం. అంత మాత్రం సంఘానికే ఎందుకింత రచ్చ చేస్తున్నారు..? ఒకరిపై ఒకరు ఆరోపణలు ఎందుకు చేసుకుంటున్నారు ? ఎప్పుడూ లేనంతగా ఎందుకు మీడియాలో పంచాయతీలు పెట్టుకుంటున్నారు ? అంటే వీటన్నింటికీ ఒకటే సమాధానం. అదే ఆధిపత్యం.


ఆ మాటలు విని కన్నీళ్లు ఆగలేదు.. ఆయన ఎప్పటికీ నా స్నేహితుడే: మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు


టాలీవుడ్‌లో దాసరి పొజిషన్ కోసమే ఎన్నికలు !


తెలుగు చిత్రపరిశ్రమకు నిన్నామొన్నటి వరకూ అంటే దాసరి నారాయణ రావు చనిపోయే వరకూ ఆయనే పెద్ద దిక్కు. పరిశ్రమలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన పరిష్కరించేవారు. పరిశ్రమకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన ముందు ఉండి పరిష్కారం కోసం ప్రయత్నించేవారు. ఆయనను వ్యతిరేకించే వాళ్లు ఉంటారు కానీ.. ఆయన నాయకత్వాన్ని అంగీకరించారు. పరిశ్రమలో ప్రత్యక్షంగా.., పరోక్షంగా ఎక్కువ మంది ఆయన ఆశీస్సులతో ఎదిగిన వారు ఉండటం కూడా ఆయన నాయకత్వానికి ఏకాభిప్రాయం రావడానికి ఓ కారణం. అదే సమయంలో ఆయన రాజకీయంగానూ పలుకుబడి సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు. అప్పట్లో ఆయన తర్వాత ఎవరు అన్న ప్రశ్న కూడా రాలేదు. అలాంటి ఆలోచన కూడా ఎవరికీ లేదు.


Also Read : ''ఇండస్ట్రీలో నటుల బ్యాంక్ బ్యాలెన్స్ కంటే ఈగోలే ఎక్కువ..''


చిరంజీవి నాయకత్వానికి అందకి ఆమోదం లేనట్లే ! 


దాసరి నారాయణరావు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసిన తర్వాత టాలీవుడ్‌లో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ ప్రారంభమయింది. సహజంగానే అందరి చూపు చిరంజీవి వైపు పడింది. ఆయన ఇండస్ట్రీలో అందరూ అంగీకరించే మెగాస్టార్ మాత్రమే కాకుండా టాలీవుడ్ సమస్యలు పరిష్కరించడానికి దాసరి తర్వాత కాస్తంత చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనను ఎవరూ వ్యతిరేకించలేదు. అందరూ దాసరి తర్వాత ఆయనే అని చెప్పుకోడం ప్రారంభించారు. బయటకు చెప్పకపోయినా ఆయన నాయకత్వాన్ని అంగీకరించడానికి ఇండస్ట్రీ మొత్తం సిద్ధంగా లేదని తొలి సారిగా "మా" ఎన్నికలే వెలుగులోకి తెచ్చింది. ప్రకాష్ రాజ్‌ను "మా" అధ్యక్షుడిగా చేయాలన్నది చిరంజీవి నిర్ణయమని టాలీవుడ్‌లో బహిరంగ రహస్యం. కానీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఓ వర్గానికి సపోర్ట్ చేయకూడదు కాబట్టి ఆయన తరపున సోదరుడు నాగబాబు వ్యవహారాలు చక్క బెడుతున్నారు.  ఆయన నిర్ణయాన్ని మోహన్ బాబు వ్యతిరేకించారు. ఫలితంగా పోటీ అనివార్యమయింది.


Also Read : Also Read : "మా" ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వడం లేదు.. ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన !


అసలు పోటీ మోహన్ బాబు వర్సెస్ చిరంజీవే ! 


చిరంజీవి మద్దతుతో నిలబడిన ప్రకాష్ రాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఆధిపత్యాన్ని అంగీకరించినట్లేనన్న భావనతో మోహన్ బాబు తన కుమారుడ్ని రంగంలోకి దింపారని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మోహన్ బాబు కూడా తనది అదే అభిప్రాయమని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలంటూ ఎవరూ లేరని తేల్చేశారు. దాసరితోనే ఆ స్థానం పయనం ఆగిపోయిందన్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఆ మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికి.. ఎప్పటికీ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవేనని స్పష్టం చేశారు. "ఇండస్ట్రీ పెద్ద" హోదా విషయంలో మోహన్‌బాబు, ప్రకాష్ రాజ్ మాటలతో  "మా" ఎన్నికల అసలు అజెండా స్పష్టమయినట్లయింది. విష్ణు ప్యానల్ గెలిస్తే మోహన్ బాబు ..  ప్రకాష్ రాజ్ గెలిస్తే చిరంజీవి దాసరి నారాయణరావు పొజిషన్ అయిన "ఇండస్ట్రీ పెద్ద" హోదాను అనధికారికంగా  దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే ఇంత పోటీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.


Also Read : Manchu Vishnu: కృష్ణం రాజుతో విష్ణు భేటీ.. మంచు ట్వీట్‌పై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం


చిరంజీవి - మోహన్ బాబు మధ్య నాడు "లెజెండ్" - నేడు "ఇండస్ట్రీ పెద్ద" పంచాయతీ !


చిరంజీవి - మోహన్ బాబుల మధ్య ఇలాంటి వివాదం ఇప్పుడే కాదు.. గతంలోనూ ఉంది. 2007లో వజ్రోత్సవ వేడుకలను టాలీవుడ్ ఘనంగా నిర్వహించింది. అన్ని తరాల టాలీవుడ్ నటులు ఇందులో భాగమయ్యారు. ఈ వేడుకల్లో లెజెండ్, సెలబ్రిటీ అవార్డులు ప్రకటించారు.  మెగాస్టార్ కి లెజెండరీ క్యాటగిరిలో అలానే మోహన్ బాబు కి సెలబ్రిటీ క్యాటగిరి లో అవార్డులు ఇచ్చారు. అప్పుడే మోహన్ బాబు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తానే లెజెండ్‌నన్నారు. తన అవార్డును తిరస్కరించారు. చిరంజీవి కూడా లెజెండ్ అవార్డును తీసుకోలేదు. టాలీవుడ్ 100 ఏళ్ల వేడుకలో కూడా తాను లెజెండ్ అని ఇండస్ట్రీ గుర్తిస్తే అవార్డుని తీసుకుంటానని ప్రకటించారు. అప్పట్లో లెజెండా వివాదం ఇరువురి మధ్య రాగా ఇప్పుడు "మా" ఎన్నికల ద్వారా ఇండస్ట్రీకి ఎవరు పెద్ద అన్న పోటీ ఇద్దరి మధ్య ప్రారంభమైనట్లుగా భావించవచ్చు.  


Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్


ఇటీవలి కాలంలో చిరంజీవి ఫ్యామిలీతో మోహన్ బాబుకు దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయన్న అభిప్రాయం కలిగింది. ఇరువురూ ఇచ్చి పుచ్చుకుంటున్న పరిస్థితులు కనిపించాయి. ఓ పంక్షన్‌లో ముద్దులు కూడా పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా వారి మధ్య మా ఎన్నికలు చిచ్చు పెట్టినట్లుగానే కనిపిస్తున్నాయి. ఇరువురి మధ్య పాత స్నేహం మళ్లీ రావాలంటే మా ఎన్నికల వేడి పూర్తిగా తగ్గిపోవాల్సి ఉంటుంది. 


Also Read : బాలకృష్ణతో మంచు విష్ణు భేటీ.. ప్రకాష్ రాజ్ విందు రాజకీయాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి