తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పరిగి, అరకు, విజయవాడలో భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని.. వెల్లడించింది. ఏపీలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
సోమవారం హైదరాబాద్, పరిగి, అరకు, విజయవాడలో కురిసిన వర్షానికి జనాలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండకాసినా.. సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. మబ్బులు పట్టి జోరుగా వాన పడింది. రాజేంద్రనగర్‌లో గంటసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్ ఏరియాలోనూ వాన కురిసింది.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి పలుకాలనీలు జలమయం అయ్యాయి. జాతీయరహదారిపై వర్షపునీరు నిలిచింది. శాంతినగర్‌కాలనీలో మురుగునీరు వీధుల్లోకి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలోనూ వర్షం దంచి కొట్టింది. విశాఖ జిల్లా అరకులో కుండపోత వర్షం కురిసింది. ఘాట్‌రోడ్డు నదిని తలపించింది. పై నుంచి ఉద్ధృతంగా వరదనీరు వస్తుండటంతో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలో వర్షం కురిసింది.
పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఢిల్లీ, చెన్నైలో అక్కడక్కడా ఉరుములు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి