IRCTC Scam Case: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వైద్య చికిత్స కోసం ఆయన విదేశాలకు వెళ్లొచ్చని దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.


వైద్యం కోసం


అక్టోబర్ 10 నుంచి 25 వరకూ వైద్య చికిత్స కోసం సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని లాలూ.. కోర్టులో పిటిషన్ వేశారు. ఐఆర్‌సీటీసీ (IRCTC) కుంభకోణంలో లాలూ ప్రసాద్‌‌పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం లాలూ బెయిల్‌పై ఉన్నారు. 


ఇదే కేసు


లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్‌సీటీసీకి చెందిన రెండు హోటళ్ల కాంట్రాక్టులను ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించడంలో అవినీతికి పాల్పనట్టు సీబీఐ ఆరోపించింది. రాంచి, పూరీలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లను 2006లో ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో అక్రమాలకు పాల్పడ్డారని రబ్రీ దేవీ, లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్‌పై సీబీఐ అభియోగాలు మోపింది.


ఐఆర్‌సీటీసీ హోటల్‌ కాంట్రాక్ట్ తమకు వచ్చేలా చేసినందుకు సుజాత హోటల్స్ యజమానులు విజయ్, వినయ్ కొచ్చార్‌లు పట్నా జిల్లాలో మూడు ఎకరాల కమర్షియల్ ప్లాట్‌ను లాలూ కుటుంబానికి ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి.


ఈ కేసులో 2019 జనవరిలో లాలూకు బెయిల్ మంజూరైంది. తమ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని కోర్టు షరతులు విధించింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లలేకపోయారు.


చురుగ్గా


ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత లాలూ.. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. నితీశ్ కుమార్.. తిరిగి ఆర్‌జేడీతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నితీశ్ కుమార్‌తో కలిసి ఇతర విపక్ష నేతలను లాలూ కలుస్తున్నారు. 2024లో భాజపాను కేంద్రం నుంచి గద్దె దించుతామని లాలూ ధీమా వ్యక్తం చేశారు.


ఆదివారం దిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నితీశ్, లాలూ సమావేశమయ్యారు. ఈ మూడు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఐదేళ్లకు పైగా అయింది. 


ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవి లాల్ జయంతి సందర్భంగా ఫతేహాబాద్‌లో జరిగే ర్యాలీకి నితీశ్, లాలూ హాజరయ్యారు. ఐఎన్‌ఎల్‌డీ నేత ఓపీ చౌతాలా ఈ సభను నిర్వహించారు. 


" నితీశ్ కుమార్, నేను.. సోనియా గాంధీని కలిశాం. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన వెంటనే మరోసారి భేటీ అవుదామని సోనియా గాంధీ అన్నారు. 2024 ఎన్నికల కోసం ఒక బలమైన ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని దానికి కాంగ్రెస్ నాయకత్వం వహించాలని మేం సోనియాను కోరాం. దీనికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు. విపక్షాలను ఏకం చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. "




-                       లాలూ యాదవ్, ఆర్‌జేడీ అధినేత

 




2024లో భాజపా ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేస్తాం. నేను, నితీశ్ కుమార్‌తో కలిసి మరోసారి దిల్లీ వెళ్లి త్వరలో సోనియా గాంధీని కలుస్తాను. రాహుల్ గాంధీ తన యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత సమావేశమవుతాను.                             "
-  లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్‌జేడీ అధినేత




 


Also Read: Harsh Mahajan Joins BJP: కాంగ్రెస్‌కు భారీ షాక్- పార్టీకి గుడ్‌బై చెప్పిన మరో సీనియర్ నేత!


Also Read: Bihar Politics: తేజస్వీ యాదవ్‌ను బిహార్ సీఎం చేసిన నితీశ్ కుమార్!