Iran Hijab Protest: 


యాంటీ హిజాబ్‌కు మద్దతుగా..


ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా కొంత కాలంగా మహిళలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా హిజాబ్ ధరించా ల్సిందేనన్న నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడి మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. కొందరు సోషల్ మీడియాలోనూ వీరికి సపోర్ట్ చేస్తున్నారు. జుట్టు కట్ చేసుకుని, హిజాబ్‌ను కాల్చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ టర్కిష్ సింగర్ కూడా వీరికి మద్దతు పలికింది. సింగర్ మెలెక్ మోసో స్టేజ్‌పైనే నిలబడి తన జుట్టు కట్ చేసుకుని...ఇరాన్‌లోని యాంటీ హిజాబ్‌కు సపోర్ట్ చేశారు. ఇరాన్‌లో 22ఏళ్ల యువతి మహసా అమిని మృతి చెందాక...ఉన్నట్టుండి ఈ ఉద్యమం ఉవ్వెత్తున  ఎగిసింది. అక్కడి మోర్టాలిటీ పోలీసుల కస్టడీలోనే ఆ యువతి చనిపోవటం పెద్ద ఎత్తు నిరసనలకు కారణమైంది. 10 రోజుల్లోనే దాదాపు 46 సిటీల్లోకి విస్తరించాయి నిరసనలు. 






75 మంది మృతి? 


ఈ ఆందోళనల్లో 75 మంది మృతి చెందారని  తేల్చి చెప్పింది ఓ నివేదిక. "ఇరాన్ పౌరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వాళ్ల ప్రాథమిక హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం వీరిని బులెట్‌లతో అడ్డుకోవాలని చూస్తోంది" అని ఇరాన్ హ్యూమన్ రైట్స్ (IHR) డైరెక్టర్ మహమూద్ అమిరి వెల్లడించారు. దాదాపు ఆరు రోజులుగా అక్కడ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది. దేశంలోని దాదాపు 30 కీలక నగరాల్లో మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. నార్తర్న్‌ ప్రావిన్స్ కుర్దిస్థాన్‌లో ఈ నిరసనలు మొదలయ్యాయి. అక్కడి నుంచి దేశమంతా పాకాయి. బబోల్ అనే మరో సిటీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వివరిస్తోంది. ఈ వివాదంపై ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పందించారు. మొరాలిటీ పోలీసుల కారణంగా ఓ యువతి చనిపోయిందన్న ఆరోపణలను సరైన విధంగా విచారించేలా చర్యలు చేపడతామని చెప్పారు. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి హాజరైన సమయంలో మీడియా ఆయనను ప్రశ్నించింది. ఆమె గుండెపోటుతో మరణించిందన్న ప్రస్తావన రాగా...యూఎస్, యూకేలోనూ ఇలాంటి కస్టడీ డెత్స్‌ నమోదయ్యాయని వ్యాఖ్యానించారు. వాటిపైనా విచారణ జరిపించారా..? అని ఎదురు ప్రశ్న వేశారు ఇబ్రహీం. పాశ్చాత్య దేశాలు మానవ హక్కుల విషయంలో రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతు న్నాయని విమర్శించారు. "ఏదేమైనా ఇది కచ్చితంగా విచారణ జరపాల్సిన విషయం. ఆ యువతి చనిపోయిందని తెలిశాక ఆ కుటుంబంతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. విచారణ జరిపిస్తానని వాళ్లకు హామీ కూడా ఇచ్చాను" అని చెప్పారు. 


ఆ నిబంధనలతోనే ఇదంతా..


నిరసనలతోనే మహిళలు ఆగిపోలేదు. తమ జుట్టుని కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇప్పుడిదో ఉద్యమంలా మారింది. ఇరాన్ మహిళలంతా తమ జుట్టుని కట్ చేసుకుని, తరవాత హిజాబ్‌లను మంటల్లో తగలబెడుతున్న వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇస్లామిక్‌ లా ప్రకారం...ఏడేళ్లు పైబడిన మహిళలెవరైనా జుట్టుని హిజాబ్‌తో కవర్ చేసుకోవాలి. పొడవాటి, వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ఈ ఏడాది జులై5న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రత్యేకించి మహిళల వేషధారణపై ఇంకా ఆంక్షలు విధించారు. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. దీనిపైనే...మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన వారిని అరెస్ట్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. హిజాబ్‌ను ధరించని మహిళలకు కఠినశిక్ష అమలు చేయాలని రూల్స్ పాస్ చేశారు. అక్కడి మహిళలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా హిజాబ్‌లను తొలగిస్తున్నారు.  


Also Read: Soldier Mykhailo Dianov: రష్యా చేతికి చిక్కితే ఇదీ పరిస్థితి! ఉక్రెయిన్ జవాన్ షాకింగ్ ఫొటో!