2021 దేశం ఎన్నో పరిణామాలకు వేదికైంది. కాలం గడిచే కొద్దీ ముందుకు సాగుతూండటం సహజం. కానీ దీనికి భిన్నంగా దేశానికి 2021 చాలా కీలకమైన పాఠాల్ని నేర్పింది., ఎక్కడా ముందుకు వెళ్లకపోవడం ఒకటి అయితే.. కొన్ని నిర్ణయాలను ఎంతో నష్టం జరిగిన తర్వాత వెనక్కి తీసుకోవడం ఒకటి., ఇలాంటి విశేషాలన్నింటినీ సంవత్సరాంతం సందర్భంగా మీ ముందుకు తీసుకు వస్తున్నాం.


Also Read: గులాబీకి పూలు - రాళ్లు కూడా .. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిన 2021 !


జనవరి :  వాక్సిన్లు..వ్యవసాయ చట్టాలు ..అయోధ్య విరాళాలు!


2021 జనవరిలో భారత్‌లో హాట్ టాపిక్ ఏది అంటే వ్యాక్సినేషనే. కరోనా మహమ్మారిపై ఇండియన్లు సాగించిన పోరాటం వ్యాక్సిన్ల రూపంలో అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు వ్యాక్సిన్లు పంపిణీ చేయడం ప్రారంభించారు. ముందుగా ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి ఇచ్చారు. ప్రధానమంత్రి తెలుగు రాష్ట్రాల టీకా వారియర్స్‌తో మాట్లాడేటప్పుడు.. గురజాడ పద్యం..  "దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్"ను తెలుగులోనే చదివి వినిపించి వ్యాక్సినేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారు. ఇక అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం విరాళాల ప్రక్రియ జనవరి మొత్తం దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. కార్పొరేట్లు.. సామాన్య ప్రజలు అందరూ పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. జనవరి నెలలో అయోధ్య రాముడికి దాదాపుగా రూ. వెయ్యి కోట్లుగా విరాళాలు వచ్చాయి. ఇక ఇదే నెలలో అత్యంత వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కారణంగా గత డిసెంబర్‌లో ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకునే వరకూ ్మలు చేయలేకపోయారు.


Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్‌ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?


ఫిబ్రవరి :  రైతుల ఆందోళనలు.. ఆజాద్ కోసం మోడీ కన్నీళ్లు !


రైతు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ రైతుల ఆందోళనలు ఫిబ్రవరి మొత్తం ఉధ్దృతంగా సాగాయి. వారిని అడ్డుకోవడానికి కేంద్రం అనేక రకాల ప్రయత్నాలు చేసింది. రోడ్లపై బాణాలు గుచ్చింది. అదే సమయంలో ఫిబ్రవరి నెలలో మరో విశేషం చోటు చేసుకుంది. అదే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కన్నీరు పెట్టుకోవడం.  రాజ్యసభలో కాంగ్రెస్ కీలక నేత గులాంనబీ ఆజాద్‌ పదవి కాలం ముగిసింది. ఈ సందర్భంగా వీడ్కోలు ప్రసంగం చేసిన మోడీ కన్నీరు పెట్టేసుకున్నారు. తన సొంత పార్టీ సభ్యుడు సభ నుంచి దూరమవుతున్నారన్నంతగా మోడీ ఫీలైపోయారు.  అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియాన్ని ప్రారంభించారు. మోతెరా సర్దార్ పటేల్ స్టేడియాన్ని కూలగొట్టి కొత్తది నిర్మించారు. దానికి మోడీ పేరు పెట్టారు. దాన్ని ఆయనే ఫిబ్రవరిలో ప్రారంభించారు.


 
మార్చి : కర్ణాటక బీజేపీ మంత్రి రాసలీలల సీడీనే హైలెట్ !


ఈ ఏడాది మార్చిలో కర్ణాటక బీజేపీ మంత్రి రాసలీల వ్యవహారం హైలెట్ అయింది. మంత్రి  రమేష్ జార్కిహోళి ఉద్యోగం పేరుతో యువతిని వంచించారు. చివరికి ఆయనతో మంత్రి పదవితో రాజీనామా చేయించారు. ఆ యువతి కూడా.. ప్లాన్డ్ గా మొత్తం  వ్యవహారాలన్నీ రికార్డు చేసింది. దాంతో రమేష్ జార్కిహోళి పరువు పోయింది. ఇక బెంగాల్ ఎన్నికల వేడి మార్చిలో చాలా ఎక్కువగా ఉంది. పెద్ద ఎత్తున తృణమూల్ నుంచి బీజేపీలో చేరికలు జరిగాయి. ఈసీ కూడా ఎన్నికల నిర్వహణలో కీలకమైన అధికారులందర్నీ పక్కకు తప్పించింది. ఇది కూడా వివాదాస్పదమయింది. ఇక నరేంద్రమోడీ టీకా వేయించుకున్నారు. ఆయన స్వదేసీతయారీ కోవాగ్జిన్ టీకాను మార్చిలోనే మొదటి డోస్ వేయించుకున్నారు. బీజేపీని వ్యతేరికించే బాలీవుడ్ సెలబ్రిటీలపై పెద్ద ఎత్తున ఐటీదాడులు ఈ నెలలోనే జరిగాయి. అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్ను, వికాస్ భల్, ఫాంటమ్ ఫిల్మ్స్ వంటి వాటిపై సోదాలు జరిగాయి.


Also Read: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!


ఏప్రిల్ :  ఊపిరి ఆడని దేశం !


ఏప్రిల్‌లో కరోనా డెల్టా వేరియంట్ కారణంగా దేశానికి ఊపిరి ఆడలేదు. ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కొన్ని వందల మరణాలు ఈ నెలలో ఆక్సీజన్ కొరత కారణంగా చోటు చేసుకున్నాయి. కేంద్రం నేరుగా లాక్ డౌన్ విధించలేదు. కానీ రాష్ట్రాలు మాత్రం ఆంక్షలు విధించుకున్నాయి. ఏప్రిల్‌లోనే సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది. అయితే తమిళనాడు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు.. రజనీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసి... వారి ఓట్లు పొందేందుకు బీజేపీ అవార్డు ఇచ్చిందన్న విమర్శలు వినిపించాయి. ఈనెలలోనే  తమిళ ప్రముఖ సినీ కమెడియన్ వివేక్ మరణించారు. చిన్న వయసులోనే టీకా తీసుకున్న తర్వాతనే ఆయన చనిపోవడం సంచలనాత్మకం అయింది. అయితే టీకా కారణంంగా చనిపోలేదని తర్వాత నిర్ధారించారు.


మే :  బెంగాల్‌లో మమత గెలుపు  - తమిళనాడులో స్టాలిన్ - టీకాల రచ్చ 


మే మొదటి వారంలో జరిగిన కౌంటింగ్‌లో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ అద్భుత విజయాన్ని సాధించారు. కానీ ఎమ్మెల్యేగా మాత్రం ఆమె ఎడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని అనుకున్నా బీజేపీ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. తమిళనాడులో డీఎంకే విజయం సాధించింది. స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సెకండ్ వేవ్ కరోనా విజృంభించడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఓ వైపు ఆక్సిజన్ కొరత.. మరో వైపు టీకాలను కేంద్రం ఉచితంగా ఇవ్వబోమని ప్రకటించడం వివాదాస్పదమయింది. చివరికి రాష్ట్రాల ఒత్తిడితో టీకాలను ఉచితంగా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. సోషల్ మీడియా కొత్త నిబంధనలు అంగీకరించని వారిపై కేంద్రం కొరడా జుళిపించింది.


Also Read: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్‌ రోహిత్‌' మర్చిపోలేని 2021


జూన్ :  డామినేట్ చేసిన డెల్టా రకం వైరస్ !
 
భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్న వాళ్లు పరిపాలనలో మెప్పించకపోవడం.. వివాదాస్పదంగా మారి... వారే మరోసారి గెలవడానికి మైనస్‌గా మారడం.. పార్టీని ధిక్కరించడం వంటి కారణాలతో.. బీజేపీ పలువురు సీఎంలను మార్చింది. లక్షద్వీప్‌లు జూన్‌లో మండిపోయింది. లక్షద్వీప్‌కు కొత్త చట్టాలుప్రతిపాదించడంతో అక్కడి ప్రజలు తిరగబడ్డారు. దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ..  డెల్టా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో కేంద్రంపై విమర్శలు వచ్చాయి.


జూలై :  మోడీ కొత్త టీం  - కిషన్ రెడ్డికి ప్రమోషన్  - పెగాసుస్ కలకలం ! 


కొత్తగా కేంద్ర కేబినెట్‌లోకి 43 మంది మంత్రుల్ని తీసుకున్నారు.  రెండో సారి ప్రధాని అయిన తర్వాత మోడీ.. మొదటి సారి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేశారు. కిషన్ రెడ్డికి.. కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభించింది.   పదిహేను మందికి ఉద్వాసన పలికారు. శిల్పాషెట్టి భర్తగా సెలబ్రిటీ హోదా పొందిన రాజ్ కుంద్రా పోర్న్ బిజినెస్ కేసులో అరెస్టయ్యారు.  భారత్‌లో "పెగాసుస్" సాఫ్ట్‌వేర్ సాయంతో విచ్చలవిడిగా సాగిన నిఘా వ్యవహారం  జూలైలో రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై  ప్రమాణస్వీకారం చేశారు.


Also Read: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021


ఆగస్టు : వెంకయ్య కంట తడి  - టోక్యో ఒలిపింక్స్ లో పతకాల పర్వం 
  
పార్లమెంట్ సమావేశాలు జరగలేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య కంట తడి పెట్టుకున్నారు.  పెగాసస్ అంశంపై చర్చించడానికి కేంద్రం అంగీకరించలేదు.   కొంత మంది అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆయన కంట తడి పెట్టుకున్నారు. పార్లమెంట్‌లో అనుచితంగా ప్రవర్తించడం అంటే గర్భగుడిలో అనుచితంగా ప్రవర్తించడమేనని ఆయన ఆవేదన చెందారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటపటిమ చూపించారు. మీరాబాయి చాను, పీవీ సింధు, లవ్లీనా, రవికుమాల్ దహియా, హాకీ టీం రజత, కాంస్య పతకాలు సాధించారు. కఠిన పరిస్థితుల నడుమ.. ఆటగాళ్లు... అష్టకష్టాలకు ఓర్చీ.. దేశానికి పతకాలు తెచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పేదరికాన్ని.. నిరుద్యోగాన్ని తరిమికొట్టే గొప్ప పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై నుంచి దేశ గతిని మార్చే "గతిశక్తి " అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని కోసం కేంద్రం అక్షరాలు రూ. కోటి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నారు.   మానిటైజేషన్ ప్రణాళిక ప్రకటించిన కేంద్రం రూ. ఆరు లక్షల కోట్లను రోడ్లు, ప్రాజెక్టులు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు అమ్మేసి సేకరించాలని నిర్ణయించారు.


Also Read: స్టార్ హీరోలు.. ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేదే..


సెప్టెంబర్ :  పంజాబ్‌లో సీఎం మార్పు


పంజాబ్ రాజకీయాలు అనూహ్యంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పదవి నుంచి తప్పించింది. చరణ్ జీత్ సింగ్ చన్నీని సీఎంగా నియమించింది. ప్రధానమమంత్రి నరేంద్రమోడీ క్వాడ్ మీటింగ్ కోసం అమెరికాలో పర్యటించారు.


అక్టోబర్ :  డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు ! 


షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసు చుట్టూ పె్ద్ద రచ్చ జరిగింది. నెలంతా అనేక కోణాలు వెలుగు చూశాయి. అక్టోబర్‌లో భారతీయులకు వంద కోట్ల డోసుల వ్యాక్సిన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఓ హుషారైన పాటను విడుదల చేయించారు. క రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, బస్ స్టాండ్లలో ఈ థీమ్ సాంగ్ ప్లే చేశారు.


Also Read: 2021లో లాంచ్ అయిన సూపర్ హిట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..


నవంబర్ :  రైతు చట్టాల ఉపసంహరణ -  పెట్రో ధరల తగ్గింపు  


దీపావిళి సందర్భంగా ప్రజలకు కానుకగా పెట్రోల్‌పై రూ.ఐదు, డీజిల్‌పై రూ. పది తగ్గించారు. కొన్ని రాష్ట్రాలు కూడా తగ్గించడంతో  పెట్రోల్ రేట్లు కాస్త దిగి వచ్చాయి. ప్రపంచంలో దేశాలను పరిపాలిస్తున్న వారిలో నెంబర్ వన్ భారత ప్రధాని నరేంద్రమోడీ. ఈ విషయాన్ని మార్నింగ్ కన్సల్ట్ అనే ప్రైవేటు సంస్థ ప్రకటించింది.  మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మోడీ నాయకత్వానికి 70 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. కేంద్రం రైతు చట్టాల్ని అనూహ్యంగా ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించింది.


Also Read: ఈ ఏడాదీ యువరాజ్‌ దొరకలేదు..! ప్రపంచకప్పులు అందలేదు!
 
డిసెంబర్ : ఒమిక్రాన్ భయం..భయం...  ఆధార్‌తో ఓటు అనుసంధానం !


ఇయర్ ఎండింగ్‌కు వచ్చే సరికి.. దేశంలో ఒమిక్రాన్ భయం పెరిగిపోయింది. కేసులు రోజు రోజుకు పెరిగిపోతూంటం.. ఇన్ఫెక్షన్ రేటు అత్యధికంగా ఉండటంతో ప్రభుత్వాలన్నీ ఆంక్షల బాటలోకి వెళ్తున్నాయి. కేంద్రం కూడా... అదే స్తాయిలో ఆదేశాలు జారీ చేసే  అవకాశం కనిపిస్తోంది. బహుశా కొత్త ఏడాదిలో కొంత కాలంపాటు లాక్ డౌన్ తరహా ఆంక్షల్లోకి దేశం వెళ్లినా ఆశ్చర్యపోని పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా రెండేళ్ల తర్వాత పార్లమెంట్ సమావేశాలు పూర్తిస్థాయిలో  జరిగాయి. అయితే రాజ్యసభలోసభ్యుల్నిసస్పెండ్ చేయడం వివాదాస్పదమయింది. ఓటర్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానించే బిల్లును కేంద్రం ఆమోదించింది. 


2021లో దేశం ఎన్నో క్లిష్ట సమస్యలను ఎదుర్కొంది. ప్రధాని డెల్టా వేరియంట్ మారణహోమం సృష్టించింది. ఆక్సిజన్ కొరతతో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. అయితే చివరికి ఇండియా నిటారుగా నిలబడింది. వచ్చే ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా ముందుకెళ్లాలని కోరుకుందాం..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి