Wrestlers Protest:
పోలీస్ ప్రొటెక్షన్‌తో ఇంటికి..
రెజ్లర్ల ఆందోళన మరో మలుపు తిరిగింది. ఈ నిరసనల్లో పాల్గొంటున్న ఓ మహిళా రెజ్లర్ బ్రిజ్ భూషణ్ ఇంటికి వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమెకి పోలీసులు ప్రొటెక్షన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న సమయంలో ఆమె బ్రిజ్ భూషణ్ ఇంటికి ఎందుకు వెళ్లిందన్నదే అంతు తేలకుండా ఉంది. కాంప్రమైజ్ అవ్వడానికే వెళ్లి ఉండొచన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే...ఇటీవలే ఓ మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌లో మార్పులు చేసి మళ్లీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇది కూడా సంచలనమైంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆమె బ్రిజ్ భూషణ్ ఇంటికి వెళ్లారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెజ్లర్లకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. బ్రిజ్ భూషణ్ కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని పట్టుపడుతున్నాయి. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తోనూ రెజ్లర్లు భేటీ అయ్యారు. ఆ తరవాత తమ విధుల్లో చేరారు. అటు ఉద్యోగం చేస్తూనే ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. ఇంతలోనే మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ని విత్‌డ్రా చేసుకోవడం సంచలనమైంది. తరవాత రెండ్రోజులకే మరోసారి ఆ మైనర్ తండ్రి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చారు. మార్పులు చేర్పులతో కొత్త వాంగ్మూలం రికార్డ్ చేయించారు. ఇలా రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదంలో...బ్రిజ్ భూషణ్ ఇంటికి రెజ్లర్ వెళ్లడం అనేది ఊహించని ట్విస్ట్.
రెజ్లర్లు మాత్రమే కాదు. బ్రిజ్ భూషణ్‌పై ఇంటర్నేషనల్ రెఫరీ జగ్బీర్ కూడా ఆరోపణలు చేశారు. మైనర్ రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించడం తన కళ్లారా చూశానని చెప్పారు.
"WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించడం నేను చూశాను. మద్యం మత్తులో ఇదంతా చేశాడు. 2013లో మేం థాయ్‌లాండ్‌కి వెళ్లాం. అప్పుడే తొలిసారి బ్రిజ్ భూషణ్ అసలు స్వరూపం బయపడింది"
- జగ్బీర్,ఇంటర్నేషనల్ రెఫరీ
రెజ్లర్ల డిమాండ్‌లు ఇవే..
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, సాక్షిమాలిక్ భేటీ అయ్యారు. తమ డిమాండ్‌లనూ వినిపించారు. మొత్తం 4 డిమాండ్‌లు వినిపించిన రెజ్లర్లు...రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కి మహిళా చీఫ్‌ని నియమించాలని కోరారు. తమపై పోలీసులు నమోదు చేసిన FIRలను విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్‌పై విచారణ జరిపి ఆయనను అరెస్ట్ చేయాలని తేల్చి చెప్పారు. ఓ మైనర్ రెజ్లర్‌ని కూడా ఆయన లైంగికంగా వేధించారని ఆరోపించారు రెజ్లర్లు. అంతే కాదు. రెజ్లింగ్ ఫెడరేషన్‌లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, మహిళను చీఫ్‌గా నియమిస్తే సమస్యలు తీరిపోతాయని అనురాగ్ ఠాకూర్‌కి వివరించినట్టు తెలుస్తోంది. ఇకపై రెజ్లింగ్ ఫెడరేషన్ విషయంలో బ్రిజ్ భూషణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులెవరూ జోక్యం చేసుకోకూడదని డిమాండ్ చేసినట్టు సమాచారం. కచ్చితంగా ఆయనను అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుపట్టారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే...ఈ డిమాండ్‌లన్నీ తీర్చడం కేంద్రానికి సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది.