Miss World 2023 in India:
నవంబర్‌లో పోటీలు..?
మిస్ వరల్డ్ 2023 (Miss World 2023 Competition) పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు మూడు దశాబ్దాల తరవాత ఇండియాలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో 71వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయని తెలుస్తోంది. అయితే...డేట్స్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. భారత్‌లో చివరిసారి 1996లో ఈ పోటీలు జరిగాయి. ఈ సారి భారత్‌లో పోటీలు నిర్వహిస్తామని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ (Miss World organization) సీఈవో జులియా మోర్లీ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ 2022 విన్నర్ కరోలినా బిలావ్‌స్కా (Karolina Bielawska) కూడా పాల్గొన్నారు.
"71వ మిస్ వరల్డ్ పోటీలు భారత్‌లో జరగనున్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. భారతదేశ సంస్కృతిని, అందాలను ప్రపంచానికి పరిచయం చేనున్నాం. ఈ పోటీల్లో మొత్తం 130 దేశాలకు చెందిన కంటిస్టెంట్‌లో పోటీ చేస్తారు. నెల రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి"
- జులియా మోర్లీ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో
భారత్ నాకెంతో నచ్చింది: జులియో
ఈ పోటీల్లో అన్ని రకాలుగా కంటిస్టెంట్‌లను పరీక్షిస్తారు. ప్రతిభతో పాటు సామాజిక సేవ ఉందా లేదా..? అన్నదీ టెస్ట్ చేస్తారు. కఠినమైన ఆటలూ ఆడిస్తారు. నిజానికి...ఈ సారి పోటీలు యూఏఈలో జరుగుతాయని ప్రచారం జరిగింది. అక్కడే జరుగుతాయని కొందరు కన్‌ఫమ్ చేశారు కూడా. కానీ...ఇంతలోనే షెడ్యూల్ మారిపోయింది. ఇండియాలోనే ఈ సారి పోటీలు నిర్వహిస్తామని ప్రకటించటం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్‌లో పర్యటించారు జులియో మోర్లీ. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలపై మనసు పారేసుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసి ఇంప్రెస్ అయ్యారు. అందుకే...ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకుని ఇండియాలోనే పోటీలు అంటూ ప్రకటించారు.
"ఆతిథ్యం ఇవ్వడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. నేను ఇండియాకి రావడం ఇది రెండోసారి. కానీ...సొంతింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. విలువలకు కట్టుబడి ఉన్న దేశమిది. ఐకమత్యానికీ ప్రతీక. ఇక్కడి కుటుంబ విలువలు, ప్రేమ, జాలిని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలానే ఉంది. అందుకే...ఇక్కడే పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాను"
- జులియో మోర్లీ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో
ఇప్పటికే 6గురు భారతీయ మహిళలు ఈ పోటీల్లో విజయం సాధించి ప్రపంచ సుందరి కిరీటం అందుకున్నారు. 1966లో రీటా ఫరియా తొలిసారి గెలిచారు. ఆ తరవాత 1994లో ఐశ్వర్యా రాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా మూఖే, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా కిరీటాలు అందుకున్నారు. రీసెంట్‌గా 2017లో మానుషి చిల్లర్ ఈ పోటీల్లో గెలిచారు.
ప్రియాంక చోప్రా కామెంట్స్..
రీసెంట్ గా నటి, గాయకురాలు జెన్నిఫర్ హడ్సన్ షోలో ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల్చుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 17 సంవత్సరాల వయస్సులో మిస్ వరల్డ్ విజేతగా నిలిచినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తన భర్త నిక్ జోనస్ 7 ఏండ్ల వయసులో ఉన్నట్లు తెలిపారు. ఈ మిస్ వరల్డ్ పోటీని ఆయన తన తండ్రితో కలిసి టీవీ చూసినట్లు చెప్పుకొచ్చారు. "మా అత్తగారు నాకు ఈ విషయాన్ని చెప్పారు. నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మిస్ వరల్డ్ విజేతగా నిలిచాను. ఈ పోటీ లండన్‌లో జరిగింది. అప్పుడు నిక్ ఆయన తండ్రితో కలిసి ఈ వేడుకలను టీవీలో చూసినట్లు మా అత్తగారు చెప్పారు. అప్పుడు వారు టెక్సాస్ లో నివాసం ఉన్నట్లు చెప్పారు” అని ప్రియాంక వివరించారు.
Also Read: Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్