Delhi Metro Viral Video:
మరో వీడియో వైరల్..
ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. తరచూ ఈ ట్రైన్‌లలో ఏదో అభ్యంతరకరమైన సంఘటనలు జరగడం, ఆ వీడియోలు వైరల్ అవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కొంత మంది యువకులు మెట్రోలో రచ్చ చేశారు. మెట్రో రైల్ కోచ్ డోర్ మూసుకుపోతుంటే...కావాలనే కాళ్లు అడ్డం పెట్టి ఆపేశారు. ఇలా ఒక్కసారి కాదు. పదేపదే అలాగే చేస్తూ మెట్రో కదలకుండా చేశారు. ఫలితంగా...ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. ఆ గ్యాంగ్ మాత్రం పగలబడి నవ్వుకుంటూ వీడియో తీసింది. కరోల్ బాగ్ స్టేషన్‌లో మెట్రో ఆగినప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ గ్యాంగ్ కారణంగా మెట్రో ఆలస్యంగా నడిచిందని కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అమన్ అనే ఓ నెటిజన్ ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఢిల్లీ మెట్రోని ట్యాగ్ చేస్తూ.."ఇలాంటి వాళ్ల వల్ల మెట్రో లేట్‌గా నడుస్తోంది" అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కి ఢిల్లీ మెట్రో స్పందించింది. ఏ కోచ్‌లో ఇది జరిగిందో ఆ నంబర్‌ని ఫోటో తీసి పోస్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసింది. అయితే...ఆ యూజర్ "నా దగ్గర పూర్తి వివరాలు లేవు. నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూశాను. కానీ..ఇది బ్లూ లైన్‌లో జరిగింది. ఆ కుర్రాళ్ల ముఖాలు కూడా కనబడుతున్నాయి. మీరు సులువుగానే గుర్తుపట్టొచ్చు" అని రిప్లై ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరు ఈ వీడియో పోస్ట్ చేశారో...ఆ ఐడీని ట్యాగ్ చేశాడు. దీనిపై ఢిల్లీ మెట్రో మళ్లీ స్పందించింది. మెట్రో కోచ్ డోర్‌లను అడ్డుకోవడం నేరం అని తేల్చి చెప్పింది.
"మెట్రో డోర్‌లను కావాలనే అడ్డుకోవడం శిక్షార్హమైన నేరం. ప్రయాణికులెవరైనా ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయండి. హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి కంప్లెయింట్ ఇవ్వండి"
- ఢిల్లీ మెట్రో
ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చదువుకుంటే మాత్రం ఏం లాభం..? బుద్ధి ఉండక్కర్లేదా అని తిడుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లంతా కళ్లప్పగించి చూడకుండా..వాళ్లను అడ్డుకోవచ్చుగా అని మరి కొందరు మండి పడుతున్నారు.