Satellite Towns in Bengaluru:
ఒత్తిడి తట్టుకోలేక
బెంగళూరు సిటీలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతోంది ఆ సిటీ. ట్రాఫిక్ సవాలు దాటడం ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఈ ప్రెజర్‌ని తగ్గించేందుకు కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు శివార్లలో 5 హైటెక్ శాటిలైట్ సిటీలు నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర హౌజింగ్ మినిస్టర్ జమీర్ అహ్మద్ దీనిపై ఓ రిపోర్ట్ తయారు చేయాలని కర్ణాటక హౌజింగ్ బోర్డ్ (KHB)కి ఆదేశాలిచ్చారు. ఒక్కో శాటిలైట్ టౌన్‌లో (Satellite Towns) వెయ్యి విల్లాలు కట్టేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 500 ఎకరాల్లో ఈ టౌన్‌లను కట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. మొత్తంగా అన్ని శాటిలైట్ టౌన్స్‌లలో కలిపి 25 వేల ఇళ్లు కట్టనున్నారు. KHBతో ఇప్పటికే రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి జమీర్ అహ్మద్. బెంగళూరుకి డిమాండ్ పెరుగుతోందని, ఈ డిమాండ్‌కి తగ్గట్టుగా సిటీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.
"బెంగళూరుకి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ విల్లాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లకు ఈ సౌకర్యం కోసం చూస్తున్నారు. అందుకే...ఈ ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌కి అనకూలమైన స్థలం ఎక్కడుందో వెతుకుతున్నాం. త్వరలోనే గుర్తించి ప్రాజెక్ట్ మొదలు పెడతాం"
- జమీర్ అహ్మద్, కర్ణాటక హౌజింగ్ మినిస్టర్
ఆయా స్థలాల ఓనర్లు, కర్ణాటక హౌజింగ్ బోర్డ్ సగం సగం ఖర్చులు భరించుకుని ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. నైరుతి బెంగళూరులో హౌజింగ్ ఏజెన్సీ నేతృత్వంలో ఓ టౌన్‌షిప్ కట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2 వేల ఎకరాల్లో వీటిని నిర్మించనున్నారు. మొత్తం 10 వేల ఇళ్ల కట్టనున్నారు.
ట్రాఫిక్..ట్రాఫిక్..
బెంగళూరు అనగానే చాలా మంది భయపడేది ట్రాఫిక్ కే. అక్కడి ప్రజలు గుబులు చెందేది ట్రాఫిక్ అంటేనే. ఇంట్లో నుండి రోడ్డెక్కామంటే గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందోనని భయపడుతుంటారు. కొన్ని ఏరియాల్లో చిన్న ట్రాఫిక్ జామ్ ఏర్పడితే అందులో గంటల తరబడి మగ్గిపోవాల్సిందే. మన గాచారం బాగోలేక ఎక్కడైనా చిన్న రోడ్డు ప్రమాదం జరిగిందంటే, గంటలకొద్దీ రోడ్లపై బారులు తీరాల్సిందే. అత్యంత ఎక్కువ రద్దీ ఉండే నగరాల్లో దేశంలోనే బెంగళూరు టాప్ లో ఉంటుంది. ప్రపంచంలో బెంగళూరు ప్లేస్ ఏంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. బెంగళూరులో సగటు ప్రయాణం వేగం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. అంటే 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే 29 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో బెంగళూరుది రెండో స్థానం. డచ్ లోకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ సంస్థ అయిన టామ్ టామ్ ఈ వివరాలను వెల్లడించింది. ట్రాఫిక్ సూచిక ప్రకారం 2022లో సిటీ సెంటర్(బీబీఎంపీ ఏరియా) కేటగిరీలో బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో నగరంగా నిలిచింది.
Also Read: Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్‌లోనే, 3 దశాబ్దాల తరవాత సర్‌ప్రైజ్