Mother Dairy Edible Oil Prices: వేరుశనగ, పొద్దు తిరుగుడు, రైస్‌బ్రాన్ సహా చాలా రకాల వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. ధార (dhara) బ్రాండ్ పేరిట వంట నూనెలను (edible oil) విక్రయిస్తున్న మదర్ డెయిరీ, అన్ని ఎడిబుల్ ఆయిల్స్ ధరలను లీటర్‌కు రూ. 10 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలతో కూడిన ఎడిబుల్ ఆయిల్ స్టాక్స్ వచ్చే వారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.
అంతర్జాతీయ పరిణామాల కారణంగా గత కొన్ని నెలలుగా వంట నూనెల రేట్లు పెరిగాయి, భారీ ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు, అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా మారి, గ్లోబల్ మార్కెట్‌లో నూనెల రేట్లు తగ్గాయి. దీంతో, ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కంపెనీల వ్యయాలు తగ్గాయి. తగ్గిన వంట నూనె ధరల ప్రయోజనాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎడిబుల్ ఆయిల్ రేట్లు తగ్గించేలా ఆయా కంపెనీలకు సూచించాలని ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌ను కోరింది. లీటరు ధర రూ. 8 నుంచి రూ. 12 వరకు తగ్గించాలని సూచించింది. దీనిపై, ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి హామీ లభించింది. ఈ నేపథ్యంలో, ధార బ్రాండ్ వంట నూనెల రేట్లు తగ్గిస్తూ మదర్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. మదర్ డెయిరీ తన రేట్లను తగ్గించడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ఈ ఏడాది మే నెల మొదటి వారంలో కూడా వివిధ రకాల వంట నూనెల ధరలను మదర్ డెయిరీ తగ్గించింది.
లీటర్‌కు రూ. 10 తగ్గింపు
మదర్ డెయిరీ సమాచారం ప్రకారం, అన్ని రకాల ధార బ్రాండ్ ఎడిబుల్ ఆయిల్ MRPని లీటర్‌కు రూ. 10 తగ్గించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయ మార్కెట్‌లోనూ పంట లభ్యత పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ధార బ్రాండ్ నూనెల కొత్త ధరలు
కొత్త రేట్ల ప్రకారం... ధార బ్రాండ్ లీటర్ ప్యాకెట్ల వంట నూనెల MRP రూ. 140 నుంచి రూ. 230 వరకు ఉంటుంది. ధార రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ రేటు లీటరుకు రూ. 140కి తగ్గగా, రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ MRP రూ. 160కు తగ్గింది. లీటర్ రిఫైన్డ్ వెజిటలబుల్ ఆయిల్ రూ. 200, కాచి ఘనీ ఆవాల నూనె లీటరు రూ. 160కి లభిస్తుంది. లీటర్ ఆవాల నూనె రూ. 158కు, లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 150కు, లీటర్ వేరుసెనగ నూనె - రూ.230గా ఉంటుంది. ఈ ధరలు వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తాయి. మే నెలలో కూడా, ఎడిబుల్ ఆయిల్‌పై లీటరుకు 15 నుంచి 20 రూపాయల వరకు తగ్గించింది.
మే నెలలోనే మరికొన్ని కంపెనీలు కూడా వంట నూనెల రేట్లు తగ్గించాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్లే కంపెనీలు రేట్లు తగ్గిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: మార్కెట్ నుంచి సగం పింక్ నోట్లు మాయం, ₹500 నోట్లపై కీ అప్‌డేట్