2000 Rupees Notes: రెండు వేల రూపాయల నోట్లను మార్కెట్ చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ప్రకటించాక, పింక్‌ నోట్‌ డిపాజిట్లు బ్యాంకులను ముంచెత్తుతున్నాయి. రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసిన 2016 నాటి తరహాలో కాకుండా, ఈసారి బ్యాంకుల్లోకి పెద్ద నోట్ల రాకలో వేగం, పరిమాణం చాలా ఎక్కువగా పెరిగింది. 


బ్యాంక్‌ ఖాతాల్లోకి 2 వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేయడం లేదా చిన్న నోట్లుగా మార్చుకోవడం గత నెల 23 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, గత 16 రోజుల్లో, రూ. 1.80 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. చలామణిలో ఉన్న పింక్‌ నోట్లలో ఇది 50 శాతం. రిజర్వ్‌ బ్యాంక్‌ లెక్కల ప్రకారం, 2023 మార్చి 31 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. 3.62 లక్షల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇప్పుడు, రూ. 1.80 లక్షల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు తిరిగి వచ్చాయంటే, సగం పింక్‌ నోట్లు వెనక్కి వచ్చాయి. 


85 శాతం నోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ
ప్రజలు తమ దగ్గరున్న రూ. 2 వేల నోట్లను మార్చుకోవడానికి బదులు, డిపాజిట్‌ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. పెద్ద నోట్లు పట్టుకుని బ్యాంకులకు వచ్చే వాళ్లలో 85 శాతం మంది ఖాతాల్లో జమ చేస్తున్నారని, కేవలం 15 శాతం మంది మాత్రమే చిన్న నోట్లుగా మార్చుకుంటున్నారని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. ఇది పూర్తిగా తమ అంచనాలకు తగ్గట్టుగానే ఉందని, బ్యాంకుల్లో నోట్లను డిపాజిట్ చేసేందుకు ఎలాంటి హడావిడి, భయాందోళనలు ప్రజల్లో లేవని చెప్పారు. 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి 4 నెలల సమయం ఉందని, నోట్లను డిపాజిట్ చేయడానికి తొందరపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఆర్‌బీఐ వద్ద సరిపడా కరెన్సీ నిల్వలు ఉన్నాయని, నోట్ల కొరత లేదన్నారు. మరొకమాట కూడా చెప్పారు. పనులన్నీ వాయిదా వేస్తూ చివరి నిమిషంలో హడావిడి పడడం మనకు అలవాటు అని అన్నారు. కాబట్టి, 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ చివరి 10-15 రోజుల్లో పోటీ మొదలుకావచ్చని చెప్పారు.


రూ.500 నోట్ల రద్దు చేసి, రూ.1000 తిరిగి తెస్తారా?
రూ. 1,000 నోటును మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొస్తారా, రూ. 500 నోట్లను ఉపసంహరించుకుంటారా అని ఆర్‌బీఐ గవర్నర్‌ను అడిగితే, దానికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. తమకు అలాంటి ఆలోచనే లేదన్నారు. దీని గురించి ఊహాగానాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


డిపాజిట్ చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30
రూ. 2,000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. బ్యాంక్‌ ఖాతాల్లోకి పింక్‌ నోట్ల డిపాజిట్ లేదా చిన్న నోట్లుగా మార్చుకోవడం 23 మే 2023 నుంచి ప్రారంభమైంది. ఇందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. అన్ని బ్యాంకుల శాఖలు, RBI 19 ప్రాంతీయ కార్యాలయాల్లో పెద్ద నోట్లను మార్చుకోవచ్చు. 2 వేల రూపాయల కరెన్సీ నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు. కాబట్టి, ఇప్పటికీ రూ. 2000 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగానే కొనసాగుతాయి. వాటిని బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు, అన్ని రకాల లావాదేవీల కోసం ప్రజలు ఉపయోగించవచ్చు. 


మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Kotak Bank, HAL