Constitution Day Of India: దాదాపు పదేళ్ల నుంచి మనం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం. రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాముఖ్యత, అంబేద్కర్ ఆలోచనలు, భావనలు వ్యాప్తి చేసే లక్ష్యంతో ఈ వేడుక ప్రతి ఏటా చేసుకుంటాం. అసలు రాజ్యాంగం అమలులోకి వచ్చింది జనవరి 26 కానీ మనం నవంబర్ 26న ఈ వేడుక చేసుకోవడం వెనుక పెద్ద చరిత్రే ఉంది.
భారత రాజ్యాంగ దినోత్సవం చరిత్ర ఏమిటి?
మనం ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1949లో ఇదే రోజున అంటే నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చింది మాత్రం 26 జనవరి 1950న. అందుకే ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.
2015 నుంచే ఎందుకు?
నవంబర్ 26న రాజ్యాంగాన్ని అనధికారికంగా ఎందుకు అమలు చేశారో తెలుసా? రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సీనియర్ సభ్యుడు డాక్టర్ సర్ హరిసింగ్ గౌర్ పుట్టినరోజు. ఆ రోజున 2015లో మొదటిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 125వ జయంతి 2015లో జరిగింది. అందుకే ఆ సంవత్సరం నుంచి అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు రాజ్యాంగ దినోత్సవాన్ని అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.
75 వసంతాల రాజ్యాంగం
ఇప్పుడు రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్నందున కేంద్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. పాత పార్లమెంటు భవనంలో జరిగే కార్యక్రమాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రముఖులు పాల్గొంటారు. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు.
ముందుగా ఈ వేడుకల్లో పాల్గొంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రత్యేక నాణెం, తపాలా బిళ్ల, కొన్ని పుస్తకాలు విడుదలు చేస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా సంస్కృత, మైథిలీ లిపిలో రాసిన రాజ్యాంగ ప్రతిని రాజ్యాంగ సభ సెంట్రల్ హాల్‌లో విడుదల చేయనున్నారు. ముందుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేస్తారు. కార్యక్రమంలో భారత రాజ్యాంగ వైభవం, ఆవిర్భావం, చారిత్రను తెలియజేసే వీడియోను ప్లే చేస్తారు.
భారత రాజ్యాంగ 75 వసంతాల కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఢిల్లీలో ఉన్న వివిధ శాఖల అధిపతులు పాల్గొంటారు.
కార్యక్రమంలో విడుదల చేసే పుస్తకాలు ఇవే
'ది క్రియేషన్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా: ఎ గ్లింప్స్'. 'ది క్రియేషన్ ఆఫ్ ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ' పేరుతో రెండు పుస్తకాలు విడుదల చేయనున్నారు.
Also Read: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !