Constitution Day 2022: నేడు (నవంబర్ 26న) భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రాజ్యాంగ పరిషత్ సభ్యులు 1949 నవంబరు 26న రాజ్యాంగానికి ఆమోదం తెలిపారు. అయితే 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా, అమలులోకి వచ్చిన రోజును గణతంత్య్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు.
దాదాపు మూడేళ్ల పాటు 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందింది. స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నరేళ్లకే సొంతంగా పరిపాలన సాగించేందుకు రూపకల్పన చేసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. బానిస పాలనకు ముగింపు పలికిన భారత్, రాజ్యాంగం అమలుతో సర్వసత్తాక, గణతంత్య్ర రాజ్యంగా అవతరించింది. ఎన్నో దేశాల రాజ్యాంగాలలోని పలు అంశాలను పరిశీలించి మన రాజ్యాంగంలో చేర్చారు.
భారత రాజ్యాంగం గురించి 10 విశేషాలు..
- ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అయితే
1930లో జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడంతో 1950లో అదే రోజున రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
- 2015లో అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు వరకు నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకునేవాళ్లం. 2015 నుంచి నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోనూ వేడుకలను నిర్వహిస్తున్నాం.
- భారత రాజ్యాంగ రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది.
- భారత రాజ్యాంగ పరిషత్ కు తొలి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆగస్టు 29, 1947న రాజ్యాంగాన్ని రచించేందుకు బీఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు.
- రాజ్యాంగ ముసాయిదా కమిటీ 165 రోజుల్లో 11సార్లు సమావేశమైంది. ఇందులో కేవలం రాజ్యాంగం కోసం 114 రోజులు సమావేశమయ్యారు.
- మొత్తం 299 సభ్యులుండగా, 284 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. 1949లో నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందింది.
- భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 448 ప్రకరణలు, 12 షెడ్యూల్స్, 115 సవరణలు ఉన్నాయి.
- భారత రాజ్యాంగం రచించడానికి అయిన మొత్తం ఖర్చు రూ.64 లక్షలు.
- రాజ్యాంగం అమలోకి రావడంతో మహిళలకు దేశంలో అన్నిచోట్లా ఓటు హక్కు లభించింది. అంతకుముందు పురుషులకు మాత్రమే ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండేవారు.
- భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీని పార్లమెంట్ లైబ్రరీలో భద్రంగా ఉంచారు. హీలియం నింపిన ఓ పెట్టెలో, నాఫ్తలీన్ బాల్స్‌తో ఫ్లాన్నెల్ గుడ్డలో చుట్టి భద్రపరిచారు.