Gujarat Riots 2002: 


విమర్శలు..


గుజరాత్ అల్లర్ల విషయంలో కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "2002 గుజరాత్‌లో అల్లర్లు సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పాం" అని ఇటీవల అమిత్‌షా అన్నారు. దీనిపై ఒవైసీ కౌంటర్‌లు వేశారు. "కేంద్రమంత్రి అమిత్‌షా గుజరాత్ అల్లర్లు సృష్టించిన వారికి బుద్ధి చెప్పాం అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామనీ చెప్పుకుంటున్నారు. కానీ ఆయన చెప్పిన పాఠాలేంటో తెలుసా..? బిల్కిస్‌ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. ఆ బాధితురాలి మూడేళ్ల కూతురుని హత్య చేసిన నేరస్థులను బయట స్వేచ్ఛగా తిరిగేలా చేయాలనీ మాకు నేర్పించారు" అని విమర్శలు చేశారు. "మీరు చెప్పిన పాఠాలను ఎన్నని గుర్తుంచుకోవాలి..? ఇలా పాఠాలు చెప్పడం వల్ల జరిగేదేమీ లేదు. నేరస్థులకు శిక్ష పడినప్పుడే సమాజంలో అసలైన శాంతి నెలకొంటుంది" అని వ్యాఖ్యానించారు ఒవైసీ. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదని అన్నారు. "అధికారం ఎప్పుడూ ఒకరికే పరిమితం కాదు. ఎప్పుడో ఓ రోజు ఆ అధికారం చేతులు మారుతుంది. ఆ అధికార మత్తులో ఉండి అమిత్‌షా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేం పాఠం నేర్పారు..? దేశమంతా మీ పరువు పోయింది. ఢిల్లీలోనూ మత కల్లోలాలు జరిగినప్పుడు మీరేం పాఠం చెప్పారు" అని ప్రశ్నించారు. 






గుజరాత్ అల్లర్లపై..


ఇటీవల గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్‌షా 2002 గుజరాత్ అల్లర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ విధ్వంసం సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పి 22 ఏళ్లుగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచామని అన్నారు. "కాంగ్రెస్ పాలనలో 1995కి ముందు గుజరాత్‌లో మత కల్లోలాలు జరిగాయి. భిన్న వర్గాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలు పెంచి, వాళ్లు అలా కొట్టుకునేలా చేసింది కాంగ్రెస్. ఆ అల్లర్లతో కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు బల పర్చుకుంది. సమాజంలోని మెజార్టీ వర్గానికి అన్యాయం చేసింది" అని చురకలు అంటించారు. రాష్ట్రంలో చాలా రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగిందని గుర్తు చేశారు. 2002లోనూ ఇదే తరహాలో అల్లర్లు సృష్టించాలని చూశారు. కానీ వాళ్లకు బుద్ధి చెప్పాం. వాళ్లను జైల్లోపెట్టాం. 22 ఏళ్లుగా రాష్ట్రంలో కర్ఫ్యూ పరిస్థితులు మళ్లీ తలెత్తలేదు. బీజేపీ వల్లే రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొంది" అని అన్నారు. 


బరిలోకి AIMIM


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతోంది ఏఐఎమ్ఐఎమ్. తామ పార్టీ 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఏఐఎమ్ఐఎమ్ రాష్ట్ర అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీ ఉనికి కేవలం 26 స్థానిక సంస్థల స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ ముస్లిం, దళితుల ఓట్లపైనే దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.


Also Read: ISRO PSLV-C54: ఇస్రో మరో రికార్డ్, పీఎస్‌ఎల్వీ సీ-54 ప్రయోగం విజయవంతం